ఈసారి జగన్ వంతు ..తెదేపా ఊరుకుంటుందా.?

388

ఏపీలో వైకాపా,తెదేపాల మ‌ధ్య ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది మాట‌కు మాట బ‌దులు చెప్ప‌డం, వీలైతే వ‌క్రీక‌రించ‌డం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఎక్క‌డ నోరు జారి మాట్లాడినా దాన్ని ప‌ట్టుకుని ర‌చ్చ‌ర‌చ్చ చేయ‌డం వైకాపా దిన‌చ‌ర్య‌ల్లో భాగ‌మైపోయింది. అధికార పార్టీ నేత‌ల స్పీచుల‌పై వైకాపా ఈ స్థాయిలో మాటు వేసి స్కాన్ చేస్తుంటే అదే ప‌ని తెలుగుదేశం కూడా చేస్తుంది క‌దా. అలాంట‌ప్పుడు జ‌గ‌న్ ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి? కానీ, జ‌గ‌న్ కూడా తాజాగా ఓ మాట జారారు.

 

గ‌ర‌గ‌ప‌ర్రులో గ‌డ‌చిన వారంపైగా గొడ‌వ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అగ్ర‌వ‌ర్ణాలూ, ద‌ళితుల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. ఒక విగ్ర‌హ ఏర్పాటు ద‌గ్గ‌ర మొద‌లైన గొడ‌వ రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌గాదాగా మారిపోయింది. ఎవ‌రికి వారు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్ర‌భుత్వం జోక్యం చేసుకున్నా పెద్ద‌గా ఉప‌యోగం లేక‌పోయింది. ఈ గ్రామానికి విప‌క్ష నేత జ‌గ‌న్ వెళ్ళి వ‌ర్గాల‌తో మాట్లాడి స‌యోధ్య కుదిర్చే ప్ర‌య‌త్నం చేసారు. ఈ ప్ర‌య‌త్నం అభినంద‌నీయ‌మే. అయితే, ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ‘చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుని పోయుంటే స‌మ‌స్య ఇంత దూరం వ‌చ్చుండేదే కాదు. ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడే బాధితుల్ని అరెస్టు చేసి ఉంటే ఇంత దూరం వ‌చ్చేది కాదు’ అన్నారు. అరెస్టు చేయాల్సింది నిందితులు అని చెప్ప‌బోయి భాధితుల్ని అనేసారు.

ఇంకేం, ‘ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాధితుల్ని అరెస్టు చేయాలా..? బాధితుల్ని ఆదుకోవాలిగానీ అరెస్టులు చేయాలా నాయనా’ అంటూ సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్ స్పీచ్ వీడియో క్లిప్పింగ్ పై కామెంట్స్ క‌నిపిస్తున్నాయి. లోకేష్ మాట్లాడ‌టం నేర్చుకోవాలంటూ ఈ మ‌ధ్య ఎమ్మెల్యే రోజా లెక్చ‌ర్లు దంచారనీ, ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే స‌ల‌హా ఇస్తారా అంటూ సెటైర్లు క‌నిపిస్తున్నాయి. లోకేష్ విష‌యంలో వైకాపా ఎంత ర‌చ్చ చేస్తోందో… ఇప్పుడు టీడీపీ కూడా అదే ప‌నిచేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇలాంటి వివాదాల‌ను పెంచి పోషించుకుంటూ పోతే అంతిమంగా సాధించేది ఏముంటుంది? ఈ చ‌ర్చ‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఏమైనా ఉప‌యోగం ఉంటుందా..?