జేసీ వెనకే ఉండి నడిపిస్తున్నారట.!

202

ఆంధ్రాలో విప‌క్షం వైకాపా నుంచి భారీ వ‌ల‌స‌లు ఉంటాయనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల‌కు చెందిన కొంద‌రు నేత‌లు సిద్ధంగా ఉన్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ జిల్లాల నేత‌ల‌తో వైకాపా అధినేత జ‌గ‌న్ స‌మావేశ‌మై వచ్చే ఎన్నిక‌లు మనవే అని బుజ్జ‌గించారట కూడా. అయినా స‌రే, వ‌ల‌స‌లు త‌ప్ప‌వ‌నే వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో అనంత‌పురంలో కీల‌క‌మైన రాజ‌కీయానికి ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి తెరలేపారనే అభిప్రాయం వినిపిస్తోంది. అనంత‌పురం అర్బన్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా వైకాపా నుంచి తెదేపాలోకి వ‌చ్చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న వెన‌క ఎంపీ జేసీ ప్రోత్సాహం బాగానే ఉంద‌ని స‌మాచారం .నిజానికి, జేసీ తెలుగుదేశంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ ఉనికిని చాటుకునేందుకు జేసీ ఏదో ఒక ర‌చ్చ చేసే ప్లాన్ చేస్తుంటారు. ఈ మ‌ధ్య‌నే రాజీనామా డ్రామా చేసారు.

తాజాగా గురునాథ్ రెడ్డిని తీసుకొచ్చి, తమ ప‌ట్టు పెంచుకునేందుకు జేసీ సోద‌రులు ప్ర‌ణాళిక ర‌చిస్తున్న‌ట్టు స‌మాచారం. జేసీ సోద‌రుల‌కూ అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రికీ మ‌ధ్య విభేదాలు ఎప్ప‌ట్నుంచో ఉన్నాయి. పార్టీ అధినాయ‌క‌త్వం కూడా గ‌తంలో చాలా స‌యోధ్య ప్ర‌య‌త్నాలు చేసినా జేసీ తీరు మార‌డం లేదు. అలాగ‌ని జేసీని దూరం పెట్టే ప‌రిస్థితి కూడా తెదేపాకి లేదు.  అందుకే అనంత అర్భన్ లో ప్ర‌భాక‌ర్ చౌద‌రికి చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతోనే గురునాథ్ రెడ్డిని తెస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కి సీటు ఇప్పించే స్థాయిలో చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచ‌గ‌ల‌న‌నే ధీమా జేసీకి ఉందట‌. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి ఈ స్థాయిలో భ‌రోసా క‌ల్పించార‌ని అనంత‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, తెదేపాలో గురునాథ్ చేరడం జ‌రిగిపోతే, అనంత రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌డం ఖాయం.