పరువు కాపాడమంటూ ‘హైదరాబాద్’ పోలీసులను కలిసారు

1741

క్రైస్తవ మతః బోధకుడు కేఏ పాల్ హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన ట్రోలింగ్ తో తన పరువు తీస్తున్నారని ఫిర్యాదు చేసారు.

తనపై వస్తున్న అసత్య ప్రసారాలు, యూట్యూబ్ చానల్స్ లో పోస్ట్ చేస్తున్న కామెడీ క్లిప్పింగ్స్ లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ కలిసి 100 యూట్యూబ్ ఛానల్స్, కొన్ని వెబ్ సైట్స్, కొంతమంది వ్యక్తుల పైన లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారందరిపైనా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు.

ఆంద్రప్రదేశ్ లో తనకు ప్రాణహాని ఉందని వ్యక్తిగత భద్రతను కల్పించాలని కోరారు. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో తనపై ఉన్న కేసులను రీ-ఓపెన్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ల నుంచి ప్రాణహాని ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారు.

ఇటీవలి కాలంలో సైబర్ ట్రోలింగ్ కు గురవుతున్న వారు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానళ్ళపై నియంత్రణ లేకపోవడంతో పలువురు సెలబ్రిటిల పరువుకు భంగం కలిగించేలా మారాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ తో తల పట్టుకుంటున్న బడాబాబులు తమను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ట్రోలింగ్ ప్రస్తుతం పోలీసులకు కొత్త తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికి యూట్యూబుకు లేఖలు రాయడానికి సన్నద్దమవుతున్నారట.