యూపీలో ఓటమికి అమిత్ షా ఏమంటారో.!

178

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కైరానా ఎంపీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భంగ‌పాటు త‌ప్ప‌లేదు. రెండు నెల‌ల కింద‌ట‌ అంటే మార్చిలో కూడా భాజ‌పా కంచుకోట అనుకున్న యూపీలో ఫుల్పూర్‌, గోర‌ఖ్ పూర్ ఎంపీ స్థానాల‌కు కూడా ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి.

సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి స్థానాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భాజ‌పాకి ఓట‌మి త‌ప్ప‌లేదు. చివ‌రి నిమిషంలో ఎస్పీ బీఎస్పీలు ఏక‌మౌతాయ‌ని ఊహించ‌లేక‌పోయామ‌నీ, వారి కూట‌మికి ధీటుగా రియాక్ట్ అయ్యేందుకు భాజ‌పా ద‌గ్గ‌ర స‌మ‌యం లేక‌పోయింద‌నీ ఆనాటి ఓట‌మిపై విశ్లేషించుకున్నారు. భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మాట్లాడుతూ ఉప ఎన్నిక‌ల  ఫ‌లితాల‌ను మోడీ నాయ‌క‌త్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుగా చూడకూడదన్నారు. యూపీలో జ‌రిగిన నాటి రెండు స్థానాల ఎన్నిక‌లూ 2019లో మోడీ నాయ‌క‌త్వం ప్రాతిప‌దిక‌న జ‌రిగిన‌వి కావ‌ని కొట్టిపారేశారు.

కైరానాలో కూడా భాజ‌పా ఓడిపోయింది. ఇప్పుడు అమిత్ షా ఏమంటారో.? ఈ ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీఎస్పీలు క‌లిసి పోటీకి దిగుతాయ‌ని ముందే తెలుసు. కైరానా ఎన్నిక విష‌యంలో యోగీ ఆదిత్య‌నాథ్ బాగానే జాగ్ర‌త్త ప‌డుతూ వ‌చ్చారు. ప్ర‌ధాని కూడా కైరానా చెరుకు రైతుల్ని ఆకర్షించే ప్ర‌య‌త్నం చేసారు. అయినా స‌రే ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ ఫ‌లితాన్ని అమిత్ షా ఎలా విశ్లేషిస్తారో చూడాలి.

ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త అన్నిసార్లూ సాధ్యం కాద‌ని అంటున్న అమిత్ షా 2019 ఎన్నిక‌ల్లో పార్టీల కూట‌మి సాధ్యం కాద‌నీ, అంద‌రూ ఒక గొడుగు కింద ఇమ‌డ‌లేర‌నీ అన్నారు. కానీ, భాజ‌పాయేత‌ర పార్టీల బ‌ల‌మైన ల‌క్ష్యం భాజ‌పాకి మ‌రోసారి అధికారం ద‌క్క‌కుండా చేయ‌డం. ఈ కామన్ పాయింట్ తో రోజురోజుకీ పార్టీల మ‌ధ్య ఐక్యత పెరుగుతోందన్న‌ది స్పష్టమవుతోంది. .