తెదేపా వద్దన్నారు సరే ..ప్రత్యామ్నాయం చెప్పలేదు

1669

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలోని అగ్ర‌వ‌ర్ణాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఆరోపించారు.

విజ‌య‌వాడలో మాట్లాడుతూ చంద్ర‌బాబును ఎవ‌రైనా న‌మ్మితే, అలాంటివారిని భ‌గ‌వంతుడు కూడా కాపాడ‌లేరంటూ వ్యాఖ్యానించారు. తెదేపా పాల‌న గురించి మ‌రోసారి ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు. మాల-మాదిగల మ‌ధ్య, కాపులు- బీసీల మ‌ధ్య చంద్ర‌బాబు చిచ్చుపెట్టార‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌కాలూ దోపిడీలు జ‌రుగుతున్నాయ‌నీ, నాయ‌కులు నిర్భ‌యంగా నిర్ల‌జ్జ‌గా దోచుకున్నారని ఆరోపించారు. మ‌రోసారి చంద్ర‌బాబుకి అవ‌కాశం ఇస్తే రాష్ట్ర ప్ర‌జ‌ల ధ‌న మాన ప్రాణాల‌కే భంగం క‌లిగే ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు.

అధికారం ఇవ్వొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు క‌న్నా పిలుపునివ్వ‌డం స‌రే కానీ ఏపీలో ఎవ‌రికి అధికారం ఇవ్వాలంటూ ప్ర‌జ‌ల‌ను కోరిన‌ట్లుగా అనుకోవాలి..? మ‌రోసారి మోడీ వ‌స్తే ఆంధ్రాకి మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు. నిన్న‌నే కేంద్ర‌మంత్రి గ‌ట్క‌రీ వ‌చ్చి గ‌డ‌చిన ఐదేళ్ళలో మోడీ పాల‌న‌లో ఏపీకి స్వ‌ర్ణ‌యుగ‌మైంద‌ని చెప్పారు.

వాస్తవానికి ఏపీ విష‌యంలో భాజ‌పాకి స్ప‌ష్ట‌త లేద‌ని పార్టీ నేత‌లే స్ప‌ష్టం చేస్తున్నారు. అలాంటి తరుణంలో తెదేపా మ‌రోసారి వ‌ద్ద‌ని క‌న్నా అంటున్నారు, కానీ ఎవ‌రు వ‌స్తే క‌రెక్టో చెప్ప‌డం లేదు. ప్ర‌తిప‌క్ష వైకాపా, తెరాస‌తో చేతులు క‌లుపుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొంటున్న రాజ‌కీయ ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో పార్టీ ఎలాంటి పాత్ర పోషించేందుకు సిద్ధ‌మౌతుందో ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వాలి.