రాష్ట్రం గురించి ‘కన్నా’ ఆవేదన చెందుతున్నారు

170

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి పేరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రూ.1.30 ల‌క్ష‌ల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసార‌ని రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ విమ‌ర్శించారు.

 

నెల్లూరులో జ‌రిగిన ఓ స‌మావేశంలో మాట్లాడుతూ అమ‌రావ‌తి నిర్మాణం కోసం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన విరాళాలు ఏమ‌య్యాయని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ధ‌నం నాయ‌కుల జేబుల్లోకి వెళ్ళిపోయి పాల‌న అంతా అవినీతిమ‌యంగా మారిపోయింద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు అవినీతిపై పోరాటంలో భాగంగా వ‌చ్చే నెల‌లో మూడు మెగా ధ‌ర్నాలు చేప‌ట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 6న ఏలూరులో, అనంత‌పురంలో 15న‌, విశాఖ‌ప‌ట్నంలో 25న పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని క‌న్నా చెప్పారు.

వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతలు తలుచుకుంటే అధికార పార్టీ అవినీతిపై ఏకంగా ఏదో ఒక కేంద్ర సంస్థ‌తో విచార‌ణ‌ జ‌రిపించే ప్ర‌య‌త్నం చేయవచ్చు కదా. రాష్ట్రస్థాయిలో ధ‌ర్నాలకు మాత్ర‌మే ప‌రిమితం కావాల్సిన అవ‌స‌రం భాజ‌పాకి ఏమొచ్చింది? అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం ఇంత‌వ‌ర‌కూ విదిల్చింది కేవ‌లం రూ.1500 కోట్లు మాత్ర‌మే. మ‌రో రూ.2,500 కోట్లు త్వ‌రలో ఇస్తామంటూ ఈ మ‌ధ్య‌నే కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం నిధులు స‌రిప‌డా ఇచ్చి ఉంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం బాండ్లు జారీ చేయాల్సిన పరిస్థితి రాదు కదా? నిధుల సేక‌ర‌ణ‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెత‌కాల్సిన అవ‌స‌రం రాష్ట్రానికి ఏముంటుంది.? వెన‌కబ‌డిన జిల్లాల అభివృద్ధి నిధులు, రెవెన్యూలోటు భ‌ర్తీ చేస్తామంటూ, చేయాల్సింది త‌క్కువే అంటూ కేంద్రం చెబుతున్న లెక్క‌ల గారడీపై క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడలేదు. కానీ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పులు చేసేస్తోంద‌ని ఆవేద‌న చెందుతున్నారు. ముందుగా కేంద్రం చేసిన ప‌నుల గురించి మాట్లాడి, ఆ త‌రువాత రాష్ట్ర స‌ర్కారుపై వేలెత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తే బాగుంటుంది.