కర్ణాటకలో భాజపాకు గడ్డు పరిస్థితి ఎదురుకానుందా.?

37

కర్ణాటకలో మూడు పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క చోట మినహా మిగిలిన నాలుగు చోట్ల కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

భాజపా సిట్టింగ్ స్థానం బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ లక్షన్నర ఓట్లకుపైగా మెజార్టీతో ఆధిక్యత ప్రదర్శించడం సంచనలనమైంది.  దశాబ్దాలుగా బళ్లారిని గుప్పిట్లో పెట్టుకున్న గాలి జనార్దన్ రెడ్డి వర్గం కూడా బోర్లా పడ్డారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుంగు అనుచరుడు బి.శ్రీరాములు సోదరి శాంతను బళ్లారిలో అభ్యర్థిగా నిలిపారు. ఆరు నెలల పదవి కాలం అయినా సరే తీవ్ర స్థాయిలో విజయం కోసం ప్రయత్నించారు.

సాధారణ ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా నోట్ల ప్రవాహం పారించారు. కానీ బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్పకు భారీ విజయం వరించింది. దీంతో బళ్లారిలో గాలి బ్రదర్స్ హయాంలో అంతమైనట్లేనని అనుకోవచ్చు. భాజపా ఆశలు పెట్టుకున్న మరో అసెంబ్లీ స్థానం జమాఖండి స్థానాన్ని గెల్చుకుంటే రాజకీయ పరిస్థితులు మారిపోతాయని భాజపా నేత యడ్యూరప్ప ఆశపడ్డారు. జమాఖండిలోనే మకాం వేసి ఎన్నికను పర్యవేక్షించారు. కానీ ఫలితం అనువుగా రాలేదు.

మరో అసెంబ్లీ స్థానం రామనగరలో భాజపా ముందే చేతులెత్తేసింది. ఆ పార్టీ అభ్యర్థి పోలింగ్‌కు రెండు రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అక్కడ్నుంచి సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి దాదాపుగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో కుమారస్వామి రెండు స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థికి తిరుగులేకుండా పోయింది.

వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్ అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. భాజపాకి అక్కడ బలం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ కలిపి. జేడీఎస్ అభ్యర్థిని నిలబెట్టాయి. దాంతో ఆ స్థానంలో ఓట్లు పెరుగుతాయని భాజపా ఆశ పడింది. భాజపాకి ఊరటనిచ్చిన ఒకే ఒక్క స్థానం శివమొగ్గ లోక్‌సభ స్థానం. ఈ స్థానం నుంచి ఉపఎన్నికల్లో యాడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రను అభ్యర్థిగా నిలబెట్టారు. అయితే యడ్యూరప్ప కుమారుడికి యాభై వేల ఓట్ల మెజార్టీ కూడా సంపాదించి పెట్టలేకపోయారు.