రివ్యూ: ‘తేజ్..ఐ లవ్యూ’ అనలేం

161

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలు అందుకున్నా తరువాత కెరీర్ గాడి తప్పింది. మాస్‌ హీరోయిజం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఈసారి తేజ్‌ ఐ లవ్‌ యు అంటూ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తేజ్ ఐ లవ్ యు అని ప్రేక్షకులు అన్నారో.? లేదో.? చూద్దాం.

కథేమంటే..

తేజ్‌ (సాయిధరమ్) చిన్నతనంలోనే అమ్మానాన్నకు దూరం కావటంతో పెద్దమ్మ(పవిత్రా లోకేష్‌) పెదనాన్న(జయ ప్రకాష్‌), పిన్నీ బాబాయ్‌లు గారాభంగా చూసుకుంటుంటారు.పదేళ్ళ వయస్సులో ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో హత్య చేసి జైలుకెళతాడు. ఏడేళ్ళ శిక్ష తరువాత ఇంటికి తిరిగి వచ్చిన తేజ్‌ను ఆ కుటుంబం మరింత ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఓ సంఘటన మూలంగా తేజ్‌ను ఇంటి నుంచి గెంటేస్తారు. ఇంట్లో నుంచి వచ్చేసిన తేజ్‌ హైదరాబాద్‌లోని బాబాయ్‌ (పృథ్వీ) ఇంట్లో ఉంటూ మ్యూజిక్‌ ట్రూప్‌లో పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఓ కుర్రాడి అడ్రస్‌ కోసం వెతుకుతూ లండన్‌ నుంచి ఇండియాకు వచ్చిన నందిని (అనుపమ)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు తేజ్‌. నందిని కూడా తేజ్‌తో ప్రేమలో పడుతుంది. కానీ తేజ్‌కు తన ప్రేమ గురించి చెప్పాలనుకున్న సమయంలో జరిగిన యాక్సిడెంట్‌లో నందిని గతం మర్చిపోతుంది. నందినికి తిరిగి గతం గుర్తుకు వచ్చిందా..? నందిని, తేజ్‌లు ఎలా ఒక్కటయ్యారు.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

తొలిప్రేమ నుంచి ఉల్లాసంగా ఉత్సాహంగా వ‌ర‌కూ వినోదమే క‌రుణాక‌ర‌న్ బ‌లం. కొత్త‌గా ఉన్నా ఉండ‌క‌పోయినా వ‌ర్క‌వుట్ అవుతాయి. ఇందులో కూడా హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌ని కామెడీగా న‌డిపిద్దామ‌నుకున్నాడు. అది ఒక్కో చోట వ‌ర్క‌వుట్ అయ్యింది. ఒక్కోచోట కాలేదు. పైగా.. సాగ‌దీత‌లా అనిపిస్తుంది. హీరో,హీరోయిన్ల‌ను క‌ల‌పాల‌న్న ఉద్దేశంతో గ‌తం మ‌ర్చిపోయిన నందినికి హీరో బ్యాచ్‌ కొన్ని క‌ట్టు క‌థ‌లు వినిపిస్తారు. వాటిని నందిని న‌మ్మేస్తుంది కూడా. నందిని ఏం చెప్పినా న‌మ్ముతుంది అన్న‌ప్పుడు నందినికి నిజ‌మే చెప్పేయొచ్చు క‌దా? కొంత మ‌ర్చిపోవ‌డం అనేది చాలా లాజిక్ లెస్‌గా ఉంది.

విశ్రాంతి త‌ర‌వాత‌.. క‌రుణాక‌ర‌న్‌ని ఈ క‌థ ఎలా న‌డ‌పాలో అర్థం కాలేదు. అందుకే హీరోయిన్‌ని తీసుకెళ్ళి హీరో ఇంట్లో పెట్టాడు. అక్క‌డ తేజ్‌కీ, అత‌ని పెద‌నాన్న‌కీ మ‌ధ్య జ‌రిగే అపార్థాలన్నీ తొల‌గిపోవ‌డం లాంటి సెంటిమెంట్ స‌న్నివేశాల‌తో కాల‌క్షేపం చేసాడు. క‌థ‌ని ఇంకాస్త సాగ‌దీయాలి కాబ‌ట్టి లేనిపోని డ్రామా పండిచ‌డానికి చూసి, తేజ్ – నందినిల‌ను మ‌రోసారి దూరం చేసాడు. తొలిప్రేమ‌తో ఈ సినిమాని పోలుస్తూ విడుద‌ల‌కు ముందు చిత్ర‌బృందం స్టేట్‌మెంట్లు ఇచ్చింది. అయితే తొలి ప్రేమ రిఫెన్సులు ఈ సినిమాలో చాలా క‌నిపిస్తాయి. హీరోయిన్ అమ్మ‌ని కాపాడి హీరోయిన్ మ‌న‌సు గెలుచుకోవటం, క్లైమాక్స్ ఎయిర్ పోర్ట్‌లోనే. తొలిప్రేమలో వర్క‌వుట్ అయిన కొన్ని ఫార్ములాల్ని ఈ సినిమాలో వాడుకున్నా ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఎవరెలా..

తేజ్‌ తొలిసారిగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటించాడు. నటన పరంగా ఆకట్టుకున్నా లుక్స్‌ పరంగా ఇంకాస్త వర్క్ అవుట్‌ చేస్తే బాగుండేది. చాలా బొద్దుగా కనిపించాడు. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను ఇమిట్‌ చేసే ప్రయత్నం చేసాడు. నందిని పాత్రలో అనుపమా పరమేశ్వరణ్ ఒదిగిపోయింది. మోడ్రన్‌ లుక్‌లోనూ అదరగొట్టింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్‌ల నటన కంటతడిపెట్టిస్తుంది.

ఫైనల్ గా..

అంద‌మైన జంట‌ని ఎంచుకున్నారు, మంచి కెమెరామెన్‌ని తీసుకున్నారు, బోలెడు మంది ఆర్టిస్టుల్ని తీసుకొచ్చారు. లాజిక్ లేని పాయింట్ ప‌ట్టుకుని ప్రేక్ష‌కుల తెలివితేట‌ల్ని పరీక్షించారు. అందుకే ‘తేజ్ ఐ ల‌వ్ వ్యూ’ అనలేకపోతున్నారు.