‘కవచం’ రివ్యూ : మలుపులు కాపాడలేదు

389

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మీడియం రేంజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కమర్షియల్‌ హిట్ అనిపించుకోలేకపోవటంతో భారీ హిట్ కొట్టాలన్న కసితో ‘కవచం’ అనే సినిమా చేసాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్ళ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథేమంటే..

విశాఖపట్నం 3 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ గా పని చేసే విజయ్‌ (శ్రీనివాస్)ఎన్‌కౌంటర్‌ స్పెలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి (కాజల్)తో ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే పెళ్ళి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. ఓ ప్రమాదం నుంచి సంయుక్త (మెహరీన్‌) అనే అమ్మాయిని కాపాడతాడు. విజయ్‌ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్‌ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్‌ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్‌ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్‌ అయ్యిందని, ఎస్‌ఐ విజయ్‌ కిడ్నాప్‌ చేసాడని న్యూస్‌ రావటంతో కథ మలుపు తిరుగుతుంది. అదే సమయంలో అసలు సంయుక్త కాఫీ షాప్‌లో పరిచయం అయిన అమ్మాయని తెలుస్తుంది. సం‍యుక్తగా పరిచయం అయిన అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త ఏమైంది..? కిడ్నాప్‌ ఆరోపణల నుండి విజయ్‌ ఎలా తప్పించుకున్నాడు అనేదే కథ.

ఎలా ఉందంటే..

యాక్షన్ థ్రిల్లర్ కు తగ్గట్టుగా ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్న దర్శకుడు కొన్ని సీన్స్‌లో థ్రిల్‌ చేసినా చాలా చోట్ల స్లోగా కథను నడిపించి నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో కిడ్నాప్‌ సీన్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆసక్తి కలిగిస్తాయి. నిజాయ‌తీ గ‌ల పోలీస్ ఆఫీస‌ర్ ఓ ట్రాప్‌లో చిక్కుకోవ‌డం, అందులోంచి బ‌య‌ట‌ప‌డి త‌న నిజాయ‌తీని కాపాడుకోవ‌డం అన్న‌ది పాయింట్‌ ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెబితే బాగుండేది.  కామెడీ, పాట‌లు, హీరోయిజం పేర్చుకుంటూ, పేర్చుకుంటూ అస‌లు క‌థ‌లోకి వెళ్లేస‌రికి ఆల‌స్యం చేసేసాడు. ఇంట్ర‌వెల్ ముందు ప‌ది నిమిషాల పాటు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌కుండా చేసాడు. ద్వితీయార్థం మొత్తం పోలీసుల‌కు దొరక్కుండా హీరో త‌ప్పించుకుంటూనే త‌న నిజాయ‌తీని నిరూపించుకోవ‌డం ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంటుంది. చిక్కుముడి వేయ‌డంలో కాదు, దాన్ని విప్ప‌డంలోనే థ్రిల్ల‌ర్ జ‌యాప‌జ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ద‌గ్గ‌రే సెకండాఫ్ ఇలా జ‌రిగి ఉండొచ్చేమో అని ప్రేక్ష‌కుడు ఓ క‌థ‌ని ఊహిస్తాడు. దాదాపుగా అదే తెరపై చూపించేసారు.

ఎవరెలా..

బెల్లంకొండ శ్రీనివాస్‌ మరోసారి మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసాడు. డైలాగులు చెప్ప‌డంలో మాత్రం ఇంకా ప‌రిప‌క్వ‌త రాలేదేమో అనిపిస్తోంది. కాజల్‌, మెహరీన్లు తమ పాత్రలకు న్యాయం చేసారు. కాజల్, శ్రీనివాస్ కంటే పెద్దదిగా కనిపించింది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ స్టైలిష్‌ లుక్‌లో మెప్పించాడు. పోలీస్‌ అధికారిగా హరీష్ ఉత్తమన్‌ సరిపోయాడు. ఇతర పాత్రల్లో ముఖేష్‌ రుషి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్‌ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా..

థ్రిల్లర్ సినిమాల్లో వేసిన ముడులను ఆసక్తి పోకుండా విప్పాలి. లేకపోతే ‘కవచం’ అయిపోతుంది.