ఎంపీ కవిత రూటు మారుతోందా.?

114

తెరాసలో కేసీఆర్ త‌రువాత పార్టీలో మంత్రి కేటీఆర్ కీలకం అనే ప్ర‌చారం ఉంది. అది నిజమని చెప్తూనే ఈ మ‌ధ్య మెట్రో రైలు ప్రారంభోత్స‌వం, గ్లోబ‌ల్ స‌మిట్ కార్య‌క్ర‌మాల్లో కేటీఆర్ ను హైలైట్ చేసారు. అయితే, కేసీఆర్ కుమార్తె, ఎంపీ క‌విత కూడా రాష్ట్ర రాజ‌కీయాల‌పైనే ఆస‌క్తి పెంచుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దాని త‌గ్గ‌ట్టుగానే ఆమె ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారట. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె మ‌రోసారి ఎంపీగా పోటీ చేయరని వార్తఃలు వినిపిస్తున్నాయి.

ఈ మ‌ధ్య ఆమె త‌న పార్ల‌మెంటు నియోజక వ‌ర్గంలోని జ‌గిత్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. నిజానికి, ఈ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గంలో తెరాస‌కు ప్ర‌త్యేకంగా ప‌ట్టులేదు. కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి ఇక్క‌డ ఎమ్మెల్యేగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో గెలుపొందారు. ఇక్క‌డ తెరాస బ‌లం పుంజుకోక‌పోవ‌డానికి వ‌ర్గ పోరే కార‌ణం అని అంటున్నారు. తెరాస‌లో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌ని నేపధ్యంలో జగిత్యాల‌లో పార్టీ బాధ్య‌త‌ల్ని క‌విత తీసుకున్నారు.

జ‌గిత్యాల‌లోనే ఒక ఇంటిని ఆమె అద్దెకు తీసుకుని పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నీ అక్క‌డి నుంచే స‌మీక్షిస్తున్నారు. నియోజ‌కవ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు, పార్టీ క‌మిటీల స‌మావేశాలూ అన్నీ ఆమె ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. ఇదంతా భ‌విష్య‌త్తు రాజ‌కీయ వ్యూహంలో భాగంగానే చూడొచ్చు. ఎందుకంటే, ఎంపీగా ఆమెకు కేంద్రంలో ఎలాంటి ప్రాధాన్య‌తా ద‌క్క‌లేదు. మంత్రి ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నించినా వ‌ర్కౌట్ కాలేదు. కాబ‌ట్టి, ఇక‌పై రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కం కావాల‌నే నిర్ణ‌యానికి ఆమె వ‌చ్చార‌నీ, దాన్లో భాగంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధ‌మౌతున్నట్టు తెలుస్తోంది.