నేరుగా ‘మోడీ’తోనే పోల్చుకుంటున్నారు

110
కాంగ్రెస్‌, భాజ‌పాల‌కు ప్ర‌త్యామ్న‌ాయ కూట‌మి ఏర్పాటు చేసి దానికి తానే నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని చెప్పుకొస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు మోడీకి ప్ర‌త్యామ్నాయం కూడా తానే అనేట్టుగా మాట్లాడుతున్నారు. మోడీ బాట‌లోనే తాను కూడా ఢిల్లీకి వెళ్తా అంటున్నారు. త‌న‌లోని ‘ప్ర‌ధాన‌మంత్రి ఆశ‌ల్ని అన్యాప‌దేశంగా కేసీఆర్ బ‌య‌ట‌పెట్టేస్తున్నారు.
తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన తెరాస శాస‌న స‌భాప‌క్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. గుజ‌రాత్ ను అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీ, ఢిల్లీ వెళ్ళి ప్ర‌ధాన‌మంత్రి అయ్యార‌న్నారు. తెలంగాణ‌ను గ‌డ‌చిన మూడున్న‌రేళ్ళలో అభివృద్ధి చేసాన‌నీ, మోడీ మాదిరిగానే ఢిల్లీ వెళ్ళి జెండా ఎగ‌రేస్తాన‌ని చెప్పారు. ఈ ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఆలోచ‌న త‌న‌కు ఎప్ప‌ట్నుంచో ఉంద‌నీ అన్నారు. 2019 త‌రువాత జాతీయ స్థాయిలో తెరాసది కీల‌కపాత్ర అవుతుంద‌నీ, దేశానికి తెలంగాణ దారి చూపిస్తుంద‌ని చెప్పారు. ప్రస్తుత‌ తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు మ‌రోసారి టిక్కెట్లు ఇస్తాన‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో 106 అసెంబ్లీ స్థానాలు సాధిస్తామన్న ధీమా వ్య‌క్తం చేసారు.
ఈ నేపధ్యంలో కేసీఆర్ ది ఆత్మ‌విశ్వాస‌మా, అతి విశ్వాస‌మా అనేదే చర్చనీయమవుతోంది . కొత్త కూట‌మికి తానే నాయ‌కుడనని స్వీయ ప్ర‌క‌ట‌న చేసుకున్నారు. కానీ, ఆయ‌న నాయ‌క‌త్వం కింద ప‌నిచేసేందుకు మ‌మ‌తా బెన‌ర్జీ సిద్ధ‌ప‌డతారా, స్టాలిన్ ముందుకొస్తారా, భ‌విష్య‌త్తులో ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా సుముఖత వ్య‌క్తం చేస్తారా, మరో రాష్ట్రంలోని ఇంకో బలమైన ప్రాంతీయ పార్టీ ఒప్పుకుంటుందా.? లాంటి ప్ర‌శ్న‌లు మూడో కూట‌మి చుట్టూ చాలానే ఉన్నాయి. భావ సారూప‌త్య గ‌ల పార్టీల‌తో చర్చించుకుని, నాయ‌క‌త్వం గురించి మాట్లాడకుండా  అడుగుముందుకేసి ఢిల్లీ జెండా పాతేస్తా అంటున్నారు.
ఈ వ్యాఖ్యల ద్వారా మూడో కూట‌మి కేసీఆర్ వ్య‌క్తిగ‌త అజెండా మీద నిర్మితం కాబోతోంద‌నే సంకేతాలు ఇస్తున్న‌ట్టుగా ఉంది. ఓర‌కంగా ఇది అతి విశ్వాస‌మే. వారం ప‌దిరోజులుగా కేసీఆర్ కేవ‌లం జాతీయ రాజ‌కీయాల గురించే మాట్లాడుతున్నారు. దేశానికి తెలంగాణ అవ‌స‌రమనీ, దారి చూపుతుందనీ అంటున్నారు. తెలంగాణ బిడ్డ ఢిల్లీని ఏల‌బోతున్నాడ‌నే ఒక ఎమోష‌న‌ల్ అంశాన్ని అంత‌ర్లీనంగా తెర‌పైకి తెస్తున్నారు. తాజా వ్యాఖ్యల ద్వారా క్షేత్ర‌స్థాయిలో తెరాస‌పై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను క‌ప్పిపుచ్చుకోవ‌చ్చనేది కూడా కేసీఆర్ వ్యూహమై ఉండొచ్చనే అభిప్రాయమూ వినిపిస్తోంది.