మూడో ఫ్రంట్ దిశగా కేసీఆర్ మరో ముందడుగు

130
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్రవారం మాజీ ప్ర‌ధాని, జెడియ‌స్‌ నాయ‌కుడు దేవెగౌడ‌తో భేటీ అయ్యారు. మ‌ర్యాదపూర్వ‌కంగా ఆయ‌న్ని క‌ల‌వడానికి మాత్ర‌మే వెళ్తున్నాన‌ని కేసీఆర్  చెప్పినప్పటికీ థ‌ర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు దిశ‌గా జ‌రిగిన మ‌రో కీల‌క భేటీగానే చూడాలి. దేవెగౌడ‌తో భేటీ అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో మ‌ద్ద‌తుగా నిలిచేందుకు దేవెగౌడ వ‌చ్చారంటూ గుర్తు చేశారు. దేశంలో ఒక కొత్త ఉద్య‌మం రావాల్సిన అవ‌స‌రం ఉంద‌నీ, దాని గురించి మాట్లాడేందుకే ఆయ‌న్ని క‌లిసాన‌న్నారు. దాదాపు ఆరు ద‌శాబ్దాల‌పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, భాజ‌పాలు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను తీర్చ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయ‌ని విమ‌ర్శించారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కూ స‌రిప‌డా సాగునీటిని అందించినా కూడా మ‌రో 30 వేల టిఎంసిల నీళ్ళు మిగులుతాయ‌నీ అన్నారు. దేశంలో ఇలాంటివి చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారాల‌కు నోచుకోకుండా ఉన్నాయ‌న్నారు.
ఈ కూట‌మి కొన్ని రాజ‌కీయ పార్టీల క‌ల‌యిక కోసం మాత్ర‌మే కాద‌నీ దేశవ్యాప్తంగా ఉండే రైతులు, పేద‌ల స‌మ‌స్య‌ల‌ను ఒకే తాటి మీదికి తీసుకుని రాబోతున్న వేదిక ఇద‌న్నారు. 2019లోపు రైతుల కోసం ఒక అజెండాను ఖ‌రారు చేస్తామ‌నీ, దాన్ని స‌మ‌ర్థించేందుకు ఎవ‌రు ముందుకొచ్చినా స్వాగ‌తిస్తామ‌న్నారు. భవిష్యత్తులో దేశ ప్ర‌యోజ‌నాల కోసం పాటుప‌డేందుకు ఎవ‌రొచ్చినా ఆహ్వానిస్తామ‌న్నారు. కొన్ని పార్టీలు భాజ‌పా లేదా కాంగ్రెస్ ఉచ్చులో ఉన్నాయ‌నీ, దేశాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఆ ఉచ్చు నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని కోరారు. తాము ఏర్పాటు చేయ‌బోతున్న‌ది ప్ర‌జ‌ల ఫ్రెంట్ అనీ, రైతుల ఫ్రెంట్ అనీ చెప్పారు.
ఇదే సంద‌ర్భంలో క‌ర్ణాట‌క‌లో ఉంటున్న తెలుగు ప్ర‌జలంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జెడియ‌స్‌కి మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ విజ్ఞ‌ప్తి చేసారు.  అవ‌స‌రం అనుకుంటే కుమార స్వామి, దేవెగౌడ కోరితే ఎన్నిక‌ల ప్ర‌చారానికి  త‌ప్పక‌ వ‌స్తానంటూ స్ప‌ష్టం చేసారు. క‌ర్ణాట‌క‌లో ఉంటున్న తెలుగువారు జెడియ‌స్‌కి మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేయ‌డం,  కేసీఆర్ ఏర్పాటు చేయనున్న థ‌ర్డ్ ఫ్రెంట్‌కి దేవెగౌడ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ఇద్దరికీ సానుకూల అంశాలే. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ పిలుపు ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దిశగా కాకుండా మూడో కూటమి ఏర్పాటు దిశగా చూస్తే ఈ కలయిక మరో ముందడుగుగానే చెప్పొచ్చు.