మరో ఉచిత మేనిఫెస్టోతో కేసీఆర్ సిద్ధమా.?

39

తెరాస అధినేత కేసీఆర్ మేనిఫెస్టోలో ఓ భాగాన్ని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అందులో ఉన్న హామీలు నిరుద్యోగ భృతి, రూ.లక్ష రుణమాఫీ, పెన్షన్ల పెంపు ఇలా అన్నీ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హమీలే.

ఆ కొద్ది భాగం మేనిఫెస్టోను చూసి కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారు. తమను కాపీ కొట్టారని మండిపడ్డారు. కానీ వాళ్ళు కూడా ఊహించని విధంగా పూర్తి స్థాయి మేనిఫెస్టో ఉండబోతోందట. కేసీఆర్ ఆరో తేదీన పూర్తి స్థాయి వరాలను తెలంగాణ ప్రజల ముందు పరచబోతున్నారు. దీనికి సంబంధించిన సూచనలు ఒక్కొక్కటిగా కేటీఆర్ బయటకు ఇస్తున్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీల్లో భాగంగా ప్రకటించారు.

గతంలో చేసినట్లు చేస్తామని చెప్పడంతో విడతల వారీగానేనని నిర్ణయానికి వచ్చారు. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఒకే విడతలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని యాదాద్రి ప్రచారసభలో ప్రకటించారు. సెంటిమెంట్ ను ఫాలో అయ్యే కేసిఆర్ నవంబర్ 6న పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ప్రధానంగా అరవై హామీలు ఉండబోతున్నాయట.

మేనిఫెస్టో కమిటీ అంటూ కేకే నేతృత్వంలో ఓ కమిటీని వేసినా ఇటీవలి కాలంలో కేసీఆర్ మేనిఫెస్టోకి తుది రూపం ఇచ్చారట. కేకే కమిటీకి వివిధ వర్గాల నుంచి వచ్చిన 300 కు పైగా విజ్ఙప్తులను కేసీఆర్‌కు అందించారు. వీటన్నింటినీ స్వయంగా పరిశీలించి పథకాలను సిద్ధం చేసారు. దళితుల్లో అసంతృప్తి గమనించి వారి కోసం వరాలను సిద్ధం చేసారట. దేశం మొత్తం తెరాస ఇచ్చే హామీల గురించి చర్చించుకునేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పుకొస్తున్నారు.