రాజకీయ ‘కత్తి’కి పని లేకుండా ‘పరిపూర్ణం’ చేసారు

116

శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేష్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా స్వామి ప‌రిపూర్ణానంద ధ‌ర్మాగ్ర‌హ యాత్ర త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే యాత్ర మొద‌లు కాక‌ముందే ఆయ‌న్ని హైదరాబాద్ లోని స్వ‌గృహంలో పోలీసులు నిర్బంధించారు. దీంతో జూబ్లీహిల్స్ లోని ఆయ‌న ఇంటి ముందు ఉద్రిక్త‌త నెల‌కొంది.

హిందుత్వ వాదులు త‌ర‌లి వ‌చ్చారు. వారిలో ఒకరు పెట్రోల్ పోసుకుంటా, ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అంటూ కాసేపు హ‌డ‌లెత్తించాడు. ప‌రిపూర్ణానంద గృహ‌నిర్బంధంపై తెలంగాణ భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న్ని అరెస్ట్ చేయ‌డం స‌రికాదంటూ తెలంగాణ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. నిర‌స‌న‌ తెల‌ప‌డం అనేది ప్ర‌జాస్వామ్యంలో రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు అన్నారు.

శ్రీ‌రాముడిపై వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా హైద‌రాబాద్ లో అల‌జ‌డికి కార‌ణం అవుతున్న క‌త్తి మ‌హేష్ ను న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రించామ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.ఈ వివాదం పరిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ భాజ‌పా నేత‌లు కూడా కొంత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి, కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసేందుకు సిద్ధ‌ప‌ద్డారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం వారి ఆలోచ‌ల్ని మొగ్గ‌లోనే తుంచేసార‌ని కొంత‌మంది అభిప్రాయ‌పడుతున్నారు.

క‌త్తి మ‌హేష్ ను న‌గ‌ర బ‌హిష్క‌ణ చేయించి, మ‌రోప‌క్క స్వామీజీని గృహ‌నిర్బంధంలో ఉంచడం ద్వారా ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టి, భాజ‌పాకి అవ‌కాశం ఇవ్వ‌కుండా చేసారని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి రెండింటినీ ఒకేసారి చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వంపై ఎవ్వ‌రూ ఎలాంటి విమ‌ర్శ‌లు చేసే ఆస్కారం ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు, సామాజికంగా ఎలాంటి అనూహ్య ప‌రిణామాలకూ అవ‌కాశం ఇవ్వ‌కుండా వ్యవహరించడంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యారు.