కొత్త సంబంధాలను ‘చారిత్రకం’గానే ఉంచుతారా.?

102

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎట్టకేలకు కలుసుకున్నారు. 1950ల‌ త‌రువాత‌ ఈ రెండు దేశాల‌ అధ్య‌క్షులు క‌నీసం ఫోన్లో కూడా ప‌ల‌క‌రించుకున్న సంద‌ర్భాలు లేవు. రెండు వైపులా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ఉద్రిక్త ప‌రిస్థితి ఉంటూ వచ్చింది.

ఇలాంటి నేప‌థ్యం ఉన్న ఇరు దేశాధినేతలు సింగ‌పూర్ వేదిక‌గా క‌లుసుకోవ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశంగానే చూస్తోంది. ఈ ఇద్ద‌రూ క‌ల‌వ‌డం, సృహృద్భావ వాతావ‌ర‌ణంలో చ‌ర్చ‌లు జ‌రుపుకుని, ఒక ఒప్పందంపై సంత‌కాలు చేయ‌డం అనేది చారిత్ర‌క‌మే. ఉత్త‌రకొరియా అణ్వాయుధాల‌ను విడిచిపెడితే, ఆ దేశ భ‌ద్ర‌త‌ను త‌మ బాధ్య‌త‌గా స్వీక‌రిస్తామ‌నీ, కొరియాలో శాంతిని నెల‌కొల్పేందుకు అన్ని విధాలుగా సాయం చేస్తామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది.

ఇద్ద‌రి మ‌ధ్యా ప్ర‌త్యేక స్నేహం ఏర్ప‌డింద‌నీ, ఇద్ద‌రం ఏదో చేయాల‌నే సంక‌ల్పంతో ఉన్నామ‌నీ ట్రంప్ ఈ భేటీ అనంత‌రం ప్ర‌క‌టించారు. ప్ర‌పంచం ఒక గొప్ప మార్పు చూడ‌బోతోంద‌నీ, గ‌తాన్ని వ‌దిలేయాల‌ని నిర్ణ‌యించామ‌నీ, ఇదో చారిత్రక స‌మావేశ‌మ‌ని కిమ్ అన్నారు. ఈ భేటీపై అమెరికాలో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది. నియంత లాంటి కిమ్ తో దోస్తీ ఏమిటని కొందరు, ట్రంప్ కేవ‌లం శాంతి కోస‌మే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి కొన్నాళ్ళ క్రితం ఇద్ద‌రి దేశాధినేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేట్టుగా వాగ్వాదాలు న‌డిచాయి. దేశాధినేత‌ల స్థాయి మ‌ర‌చిపోయి ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించుకున్నారు. ఎలా చూసుకున్న ట్రంప్, కిమ్ ల మ‌ధ్య భేటీని మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. మరి భ‌విష్య‌త్తులో కిమ్ సానుకూలంగా వ్య‌వ‌హరిస్తే ఉత్త‌ర కొరియా రూపురేఖ‌లు మారే అవ‌కాశం ఉంటుంది. ఇత‌ర దేశాల‌తో వ్యాపార‌ప‌రంగా దేశం అభివృద్ధి చెందుతుంది. చూడాలి ఏం చేస్తారో.!