కొండా వారి కూతురు రావాలని ప్రజలే కోరుతున్నారట

145

తెరాస నుండి బయటకు వచ్చేసిన కొండా కుటుంబ సభ్యులు రాబోయే ఎన్నిక‌ల్లో మూడు అసెంబ్లీ స్థానాల‌ను ఆశించిన సంగ‌తి తెలిసిందే. కొండా సురేఖ‌, ముర‌ళీల‌తోపాటు కుమార్తె సుస్మితని కూడా రంగంలోకి దించాల‌ని ప్ర‌య‌త్నించారు.

పార్టీ అధిష్టాన నిర్ణ‌యంతో ప‌నిలేకుండా ముగ్గురూ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్న‌ట్టుగానే స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ర‌ద్దు త‌రువాత కొండా సురేఖ‌కు మొద‌టి జాబితాలో కేసీఆర్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో, కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి చేరింది. ప‌ర‌కాల‌ నుంచి తాను బ‌రిలోకి దిగుతున్న‌ట్టుగా కొండా సురేఖ మీడియాతో చెప్పారు. త‌న అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళాన‌నీ, వారు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌నీ, అందుకే తాను ప‌ర‌కాల మీద దృష్టి పెట్టామ‌న్నారు.

తాజాగా వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో సురేఖ స‌మావేశ‌మయ్యారు. ‘వ‌రంగ‌ల్ తూర్పులో మీరు కాక‌పోయినా, పాప‌నైనా నిల‌బెట్టాలంటూ డిమాండ్ చెయ్య‌డానికి ప్ర‌జ‌లు వ‌చ్చారు’ అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి ప్రజల డిమాండ్ ను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇలాంటి రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా అనే ఒక భావ‌న‌కి తమ కుమార్తె వ‌చ్చింద‌న్నారు. ప్ర‌స్తుతానికైతే త‌మ కుటుంబానికి ఒక టిక్కెట్ వచ్చింద‌నీ, రెండోదానిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల‌న్నారు.

మొత్తంగా, మూడు టిక్కెట్లు త‌మ‌కు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన కొండా దంప‌తులు ఇప్పుడు రెండు చాలు అన్న‌ట్టుగా మాట్లాడుతున్నారు. వాస్త‌వానికి, ఒక్క ప‌ర‌కాల టిక్కెట్ మాత్ర‌మే ప్ర‌స్తుతానికి సురేఖ‌కు క‌న్ఫ‌ర్మ్ అయింది. పార్టీ నిర్ణ‌యం అంటూనే వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌లు త‌మ కుమార్తెను కోరుకుంటున్నార‌ని చెబుతున్నారు. అయితే మహాకూటమి కారణంగా ఏ స్థానాలు ఏ పార్టీకి వెళ్తాయ‌నే దానిలో స్ప‌ష్ట‌త లేదు.