ఫెడరల్ ఫ్రంట్, ప్రత్యేక హోదాలే ‘జగన్-కేటీఆర్’ భేటీలో కీలకం

194

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చలు జరిపారు. సమావేశం అనంతరం జగన్ మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ గురించి కేటీఆర్ వివరించారని తనతో ఫోన్ లో కూడా మాట్లాడారని చెప్పుకొచ్చారు.

కేటీఆర్ మాట్లాడుతూ ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాల గురించి జగన్ తో చర్చించామని మిగతాది కేసీఆర్ ఆంధ్రకు వెళ్ళి జగన్ తో కూలంకుషంగా చర్చిస్తారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాను తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నట్లుగా  చెప్పుకొచ్చారు. మూడేళ్ల కిందట తమ ఎంపీలు కేకే, కవిత సపోర్ట్ చేసారని ఏపీకి ప్రత్యేకహోదా తమకేమీ అభ్యంతరం కాదని పేర్కొన్నారు.

గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకహోదా ఇస్తే పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయని కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేస్తోందని కేటీఆర్ దాదాపుగా ప్రతి బహిరంగసభలోనూ చెప్పారు. ఇప్పుడేమో కేసీఆర్ ఏపీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరుపుతారని ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడతారని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై చాలా సానుకూలంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదా రావాలంటే కేసీఆర్ సపోర్ట్ ఉండాల్సిందేనన్నట్లుగా మాట్లాడారు.

రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే సంఖ్యాబలం ఉండాలని ఏపీకి ఉన్న 25 సీట్లతో అది సాధ్యం కాదని దాన్ని 42కి చేయాలని వీలైతే ఇంకా ఎక్కువ చేసుకోవాలని విశ్లేషించారు. జగన్, కేటీఆర్ అంతర్గతంగా ఏమి చర్చించినా ఏపీ రాజకీయాల గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.