మరో పదిహేనేళ్ళు ‘కేసీఆర్’ సీఎం కావాలట.!

129

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని తెరాస నేత కేటీఆర్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా  తెలంగాణలో కులపిచ్చి లేదని అంటున్నారు.

ఎన్నికల నేపధ్యంలో కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తెరాస 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్‌ను చూసే ఓటేస్తామని సామాన్య జనం అంటున్నారని చెప్పుకొచ్చారు. కూటమి అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని విశ్లేషించారు. రాహుల్, సోనియా ప్రచారంతో ఏదో అయిపోతోందని అనుకోవటం లేదన్నారు. 2004లో హైదరాబాద్ అభివృద్ధి చేసామన్న చంద్రబాబుకు ఒక్క సీటు రాలేదని గుర్తు చేసారు.

2014లో గ్రేటర్‌ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉండటంతో సీట్లు రాలేదని ఇప్పుడు సెటిలర్లంతా తమ వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంకా 15 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా ఉండాలని మా ఆకాంక్ష అన్నారు. హరీశ్‌పై కూడా దిక్కుమాలిన ఆరోపణలు చేసారని హరీశ్‌కు తనకు కుటుంబం ఫస్ట్..ఆ తర్వాతే రాజకీయాలన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసారు. వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తెదేపా పొత్తుపైనా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతినిధి కాదన్నారు. చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందంటే అది వైకాపా మాత్రమేనని వ్యంగ్యంగా విమర్శించారు.

వాస్తవానికి రాజకీయం అంటే కులసమీకరణాల ఆధారంగా నడుస్తుంది. కానీ కులం అనేది ఒక్క ఏపీకే ఉన్నట్లు తెలంగాణలో లేనట్లు మాట్లాడారు. దీనితో తెలంగాణలో కులం అనేది లేకపోతే కులాల వారీగా ఆత్మగౌరవ భవనాల పేరుతో కేసీఆర్ చేసిన రాజకీయం ఏమిటని విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆ కులసమీకరణాలు ఇప్పుడు తెరాసకు అనుకూలంగా లేవు. రెడ్లకు రాజ్యాధికారం కావాలని ఆ వర్గం ప్రచారం చేస్తోంది. వారు తెలంగాణలో పది శాతానికిపైగా ఉన్నారు. కానీ కేసీఆర్ సామాజికవర్గం వెలమ మాత్రం ఒకటి, రెండు శాతమే ఉంటుందని చెబుతూంటారు.