కన్నాపై లీగల్ పోరాటానికి దిగారు

239

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అధికార పార్టీపై అదే పనిగా అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా భాజపాపై ఎవరు విమర్శలు గుప్పించినా వారిపై వ్యక్తిగత దాడి చేస్తుంటారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసారు.

షేర్ మార్కెట్ పేరుతో ప్రజలను మోసం చేసారని విమర్శలు గుప్పించారు. దానికి కుటుంబరావు వెంటనే రియాక్టయ్యారు. లీగల్‌ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం కలిగేలా కన్నా అనుచిత వ్యాఖ్యలు చేసారని నోటీసులో పేర్కొన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని నోటీసులో హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అగ్రిగోల్డ్ వ్యవహారాలను కుటుంబరావు చూసుకుంటున్నారు. ఎలాగోలా ఆస్తులను అమ్మించి డిపాజిటర్లకు చెల్లించాలని తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల లెక్క తేల్చే విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనే వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి భాజపా నేతలకు కుటుంబరావు పంటి కింద రాయిలా మారారు.!

వాస్తవానికి కన్నా లక్ష్మినారాయణ అగ్రిగోల్డ్ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఓ లేఖ రాసారు. దానికి కుటుంబరావు ఘాటుగా కౌంటర్‌ ఇస్తూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఏ మాత్రం సానుభూతి ఉన్నా ఆస్తులన్నింటినీ కేంద్రం స్వాధీనం చేసేసుకుని డిపాజిటర్లకు సొమ్ము చెల్లించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని డిమాండ్ చేసారు. దీనిపై  కన్నా లక్ష్మినారాయణ వ్యక్తిగత విమర్శలకు దిగారు. అందుకే కుటుంబరావు వెంటనే లీగల్ చర్యలు ప్రారంభించారు.