పోలింగ్ శాతం పెరిగితే ‘కాంగ్రెస్’ ..తగ్గితే ‘హంగ్’.!

105

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల ఫలితాలను తనదైన శైలిలో విశ్లేషించారు. 119కిగాను 100 సెగ్మెంట్లలో సర్వే నిర్వహించి ఒక్కో సెగ్మెంట్లో 1000-1200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఈసారి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి కాంగ్రెస్‌ ఆధిక్యం చూపిస్తుందని వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌లో తెరాసకు ఆధిక్యం వస్తుందన్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా ఎంఐఎం గెలుస్తుందని మిగిలిన సీట్లను తెరాస, కాంగ్రెస్‌, భాజపా పంచుకుంటాయని విశ్లేషించారు. భాజపాకి ఈసారి గత ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్న ఆయన పూర్తి వివరాలు ఏడో తేదీన సాయంత్రం ప్రకటిస్తానన్నారు.

మక్తర్ నుంచి జలంధర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, బెల్లింపల్లి నుంచి జి.వినోద్ ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారని ప్రకటించారు. వీరిలో జలంధర్ రెడ్డి, జి.వినోద్ తెరాస రెబల్స్ కాగా మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ రెబల్. వినోద్, మల్ రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు. జలంధర్ రెడ్డి మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. బోథ్ నుంచి అనిల్ కుమార్ జాదవ్, నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి గెలుస్తారని ప్రకటించారు.

ఇవి ఏకపక్షంగా జరుగుతున్న ఎన్నికలు కావని పోలింగ్‌ సరళిని బట్టి ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. పోలింగ్‌ పర్సంటేజీ పెరిగితే ఒకలా పోలింగ్‌ పర్సంటేజీ మరోలా ఫలితాలు వస్తాయన్నారు. పోలింగ్‌ పెరిగితే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందని పర్సంటేజీ తగ్గితే హంగ్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇండిపెండెంట్లు ఎక్కువమంది గెలవడం ఆశ్యర్యకరమని వ్యాఖ్యానించారు. వాగ్ధానాలకు, ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఓటేయబోతున్నారని విశ్లేషించారు.