అవిశ్వాసానికి ముఖం చాటేసి పార్లమెంటును వాయిదా వేసారు

174
అనుకున్నట్లుగానే పార్ల‌మెంటు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. అద్భుతాలు జ‌రగలేదు.. అవిశ్వాస తీర్మానంపై భాజ‌పా స‌ర్కారుకు చ‌ర్చ‌కు సిద్ధమ‌వ‌లేదు. గ‌డ‌చిన కొన్ని రోజులుగా ‘స‌భ ఆర్డ‌ర్ లో లేదు’ అనే కారణం చెప్తూ అవిశ్వాసాన్ని భాజ‌పా తప్పించుకుంటూ వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్ళల‌డం, ఏపీకి భాజ‌పా చేసిన అన్యాయాన్ని ఇత‌ర పార్టీలు ప్ర‌ముఖం చేయడంతో భాజ‌పా సందిగ్ధంలో ప‌డింది.
ఈ నేప‌థ్యంలో అవిశ్వాసంపై చ‌ర్చ జరగలేదు. విపక్షాల ఆందోళన మధ్య లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు. సమావేశాలు చివరిరోజు కావడంతో సభ్యులు సయంమనంతో ఉండి సభా నిర్వహణకు సహకరించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ తెదేపా సభ్యులు సైతం ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలోనే ఉన్నారు.
ఈ సమావేశాలు జరిగిన తీరును వివరించిన స్పీకర్‌ సభను నిరవధికంగా వాయిదా వేసారు.ఈ తరుణంలో ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా మాత్రం దూకుడుగా ఉంది. ఢిల్లీ న‌డిబొడ్డున అంతిమ పోరాటం అంటున్నారు. ఎంపీల రాజీనామా, ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష అని ప్ర‌క‌టించారు. పార్ల‌మెంటు నిర‌వ‌ధికంగా వాయిదాప‌డ్డ మ‌రుక్ష‌ణ‌మే స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేస్తామ‌న్నారు. ఆ దీక్ష‌లు ఏపీ భ‌వ‌న్ లో చేస్తేనే ప్ర‌భావంతంగా ఉంటుంద‌నీ, అందుకే ఆ వేదిక‌ను ఎంచుకున్నామంటూ వైకాపా నేత‌లు అంటున్నారు.
వాస్తవానికి వైకాపా ఎంపీలు కావొచ్చు తెదేపా ఎంపీలు కావొచ్చు రాజీనామాలు చేసి ఏం సాధిస్తారు.? వెంట‌నే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయా..? పాతిక మంది ఎంపీల సంఖ్య త‌గ్గిపోతే మోడీ స‌ర్కారుకి పోయేదేమైనా ఉందా.? ఏపీకి ఎంపీలంద‌రూ మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేస్తే వెంట‌నే ప్ర‌త్యేక హోదా వ‌చ్చేస్తుందా.? అలాంట‌ప్పుడు ఈ రాజీనామాలు ఎవ‌ర్ని ఉద్ధ‌రించ‌డానికి, ఏం సాధించ‌డానికి.? మేం చేస్తున్నాం, వేరెవరికీ ఏపీపై చిత్తశుద్ది లేదు అని చెప్పుకోవటానికి తప్పితే రాజీనామాలు రాజ‌కీయంగా ప్ర‌భావితం చేయ‌లేవు.