రివ్యూ : సెంటిమెంటల్ ‘సింహం’

241
నందమూరి బాలకృష్ణ 102వ సినిమా ‘జై సింహా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో హిట్ సినిమాల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య ఎలా గర్జించాడో చూద్దాం.
కథేమంటే ..
న‌ర‌సింహ (బాల‌కృష్ణ‌)కు త‌న బాబు అంటే ప్రాణం. బాబు కోస‌మే విశాఖ‌ప‌ట్నం వ‌దిలేసి త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం వెళ్ళి డ్రైవ‌ర్‌గా పనిచేస్తుంటాడు. బాబుని వెదుక్కుంటూ గౌరి (న‌య‌న‌తార‌) కూడా కుంభ‌కోణం వ‌స్తుంది. అది సంగతి తెలుసుకుని అక్క‌డి నుంచి మ‌రో చోటికి వెళ్ళే ప్ర‌య‌త్నంలో గౌరికి ఎదురుప‌డ‌తాడు న‌ర‌సింహా. ఇద్దరూ కలవటంతో ఏం జ‌రిగింది? గౌరి, న‌ర‌సింహా ఎందుకు ఒకరితో ఒకరు కలవకూడదని అనుకున్నారు.? వారిద్దరి మధ్య జ‌రిగే క‌థేంటనేది తెలియాలంటే ‘జై సింహా’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే ..
బాలయ్య సినిమా క‌థ‌ ఇంత సింపుల్‌గా ఉండకూడదు కాబట్టే దర్శకుడు దానికి త‌గ్గ దినుసుల్ని జోడించుకుంటూ వ‌చ్చాడు. బాల‌య్య సినిమాల్లో క‌నిపించే బీభ‌త్స‌మైన ఎంట్రీ ఈ సినిమాలో లేదు. అజ్ఞాత‌వాసిలా, ఆయుధం వ‌దిలేసిన యుద్ధ వీరుడిలా  ప్ర‌యాణం మొద‌లుపెట్టి కుంభ‌కోణం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌తో మెల్ల‌మెల్ల‌గా అస‌లు క‌థ‌లోకి తీసుకెళ్ళారు. ముర‌ళీమోహ‌న్ ఇంట్లో బ్ర‌హ్మానందం అండ్ కో కామెడీ న‌వ్వించ‌లేదు. క‌మీష‌న‌ర్‌తో బాల‌య్య గొడ‌వ ప‌డ‌డం, వార్నింగ్ ఇవ్వ‌డం, బ్రాహ్మ‌ణుల వైశిష్టం గురించి చెప్ప‌డం అభిమానుల్ని అల‌రించ‌డానికే. ప్రేక్ష‌కులు, అభిమానులు ఆశించే ట్విస్ట్ స‌రిగ్గా ఇంట్ర‌వెల్ ద‌గ్గ‌ర‌ వ‌స్తుంది. ఈ సినిమాలో కొత్త‌గా అనిపించే అంశం ఏమైనా ఉందీ అంటే అది బాబుకి సంబంధించిన ఎపిసోడ్ మాత్ర‌మే. ద్వితీయార్థంలో ఫ్లాష్ బ్యాక్, న‌య‌న‌తారతో ల‌వ్ ఎపిసోడ్‌.. ప్ర‌కాష్‌రాజ్‌తో క్లాష్ సుదీర్ఘంగా సాగాయి. ధ‌ర్నా స‌న్నివేశం తప్ప మాస్‌కి ఊపు నిచ్చే అంశాలేం క‌నిపించ‌వు.
ఎవరెలా ..
బాల‌య్య‌ పేరుకి తగ్గ‌ట్టే సింహావ‌తారం ఎత్తేసాడు. తొలి స‌న్నివేశాల్లో శాంత‌మూర్తిగా క‌నిపించిన బాల‌య్య‌ అవ‌స‌రం ప‌డిన‌ప్పుడ‌ల్లా విధ్వంసం సృష్టించాడు. న‌య‌న‌తార‌ది ప్రాధాన్యం ఉన్న పాత్రే అయినా తెరపై కనిపించేది త‌క్కువ‌. విశ్రాంతికి ముందు రెండే రెండు సీన్ల‌లో క‌నిపిస్తుంది. న‌టాషా గ్లామ‌ర్ కే ప‌రిమిత‌మైంది. హ‌రిప్రియ పాత్ర గురించి చెప్పినంతగా ఏమీ లేదు. చాలా రోజుల త‌ర‌వాత బ్ర‌హ్మానందం పూర్తి స్థాయి హాస్య పాత్ర పోషించాడు. బాల‌య్య పాత్ర‌ని మిన‌హాయిస్తే మిగిలిన పాత్లను ద‌ర్శ‌కుడు స‌రిగా డిజైన్ చేయ‌లేదు.
ఫైనల్ గా..
బాల‌య్య కోస‌మే సినిమా చూస్తాం అనుకున్న‌వారు నిర‌భ్యంత‌రంగా సినిమా చూడొచ్చు. సెంటిమెంట్ డోస్‌ త‌ట్టుకుంటే చాలు. సంక్రాంతి ఫీట్ ని రిపీట్ చేయ‌లేక‌పోయినా ఫ్యాన్స్‌ని నిరాశ ప‌ర‌చ‌దు. సినిమాలో లోటు ఒక్క‌టే.. ‘అన్నీ ఉన్నాయి. కానీ ప్ర‌భావ‌వంతంగా క‌నిపించ‌వు’. వ‌య‌సు మీద ప‌డుతున్న హీరోలు ప్రేమ‌.. ప్రేమ అంటే ఎలా.?
SHARE