రివ్యూ : ఎమోషనల్ ‘తొలిప్రేమ’

115
మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రేమకధతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేమంటే ..
ఆది (వ‌రుణ్‌తేజ్‌) ఓ రైల్వేస్టేష‌న్‌లో వ‌ర్ష (రాశీఖ‌న్నా)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రైలు ప్ర‌యాణం ముగిసాక‌ కనిపించని వర్ష మూడు నెల‌ల త‌ర‌వాత‌ ఇద్ద‌రూ అనుకోకుండా ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అక్క‌డ వాళ్ళ ప్రేమకధ మొద‌ల‌వుతుంది. ఆదికి కోపం ఎక్కువ‌. వ‌ర్ష‌కి ఆలోచ‌న ఎక్కువ‌. ఆది కోపంలో నిర్ణ‌యాలు తీసుకుంటాడు. వ‌ర్ష క‌నీసం మాట్లాడాల‌న్నా ఆలోచిస్తుంది. దానితో ఇద్దరూ విడిపోతారు. ఆరేళ్ళ త‌ర‌వాత‌ ఇద్దరూ మరోసారి లండ‌న్‌లో కలుసుకుంటారు. అక్క‌డ ఏం జ‌రిగిందనేదే మిగిలిన క‌థ‌.
ఎలా ఉందంటే ..
ప్రేమ‌క‌థా సినిమాల్లో ఎక్క‌డో ఓ పాయింట్ ద‌గ్గ‌ర ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయితే చాలు క‌థ‌ని ఓన్ చేసుకుంటారు. అలాంటి పాయింట్ ఈ సినిమాలోనూ ఉంది. చిన్న చిన్న విష‌యాల‌కే విడిపోవ‌డం, మ‌ళ్ళీ క‌లుసుకోవ‌డం అనే మామూలు క‌థ‌ని ఎమోష‌న్స్‌తో చెప్ప‌గ‌లిగారు. క‌థ ప్రారంభం చాలా నెమ్మ‌దిగా ఉంటుంది. హీరో, హీరోయిన్ల తాలుకూ క్యారెక్ట‌రైజేష‌న్‌లు పూర్తి స్థాయిలో బ‌య‌ట ప‌డ్డాక‌ వారిమ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌కు స‌రైన పాయింట్ రాసుకున్నాడ‌నిపిస్తుంది. స‌రిగ్గా అంద‌రూ ఊహించిన‌ట్టే విశ్రాంతికి ఇద్ద‌రూ విడిపోతారు. సెకండాఫ్‌లో మ‌రీ సెంటిమెంట్ జోలికి, విర‌హ‌గీతాల జోలికి వెళ్ళకుండా క‌థ‌ని వీలైనంత ఎంట‌ర్‌టైన్మెంట్ జోడించి చెప్పాల‌నుకున్నాడు. స‌న్నివేశాల్లో డెప్త్ క‌నిపించ‌ని చోట‌ల్లా డైలాగుల‌తో తీసుకొచ్చాడు. అమ్మాయిల సైకాల‌జీ గురించి ఓ అమ్మాయే చెప్పటం బాగుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు రొటీన్‌గానే క‌నిపిస్తాయి. కాక‌పోతే ప్రేమ‌క‌థ‌ల‌కు అలాంటి ముగింపే ఇవ్వాలి.
ఎవరెలా..
వ‌రుణ్ తేజ్ సినిమా సినిమాకీ ఎదుగుతున్నాడు. త‌న‌కు న‌చ్చే క‌థ‌ల్ని ఎంచుకుని ప్ర‌యాణం సాగిస్తున్నాడు. న‌టుడిగా త‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. దానికంటే రాశీఖ‌న్నాకు నాలుగు మార్కులు ఎక్కువ వేసినా త‌ప్పులేదు. ఆమె కెరీర్‌లో వ‌ర్ష‌ ‘ది బెస్ట్’. అందంగా క‌నిపించ‌డంపైనే దృష్టి పెట్టింది. సినిమా అంతా వ‌రుణ్‌, రాశీలే క‌నిపిస్తారు. మెలోడీ ప‌రంగా త‌మ‌న్‌కి ఫుల్ మార్కులు ప‌డిపోతాయి. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. రిచ్‌లుక్ క‌నిపించింది. ద‌ర్శ‌కుడిలో మంచి ర‌చ‌యిత ఉన్నాడు.
ఫైనల్ గా ..
ప్రేమ‌క‌థా చిత్రాల్లో క‌థ‌లేం గొప్ప‌గా ఉండ‌వు. దాన్ని మ‌లిచిన తీరే మ‌న‌ల్ని ప్రేమ‌లో ప‌డేస్తుంది. అదే ‘తొలిప్రేమ‌’.