కోల్‌కతాలో నేడు భాజపా వ్యతిరేక కూటమి ర్యాలీ

647

కోల్‌కతాలో బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ పేరుతో భాజపా వ్యతిరేక భేరీ మోగిస్తున్నారు. ఈ ర్యాలీ కోసం తృణమూల్ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.

విపక్షాల ఐక్యతకు ఈ ర్యాలీ కీలకం కానుంది. దాదాపుగా భాజపాయేతర పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. నిన్న సాయంత్రమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోల్‌కతా చేరుకున్నారు. ఉదయం అంతా వివిధ పార్టీల నేతలతో చర్చలు జరపనున్నారు. ర్యాలీ ముగిసాక చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష పార్టీలన్నీ సమావేశం కాబోతున్నాయి. దేవెగౌడ, ఫరూక్ అబ్ధుల్లా, అఖిలేష్ యాదవ్, బిఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీష్ మిశ్రా, స్టాలిన్, ప్రపుల్ల కుమార్ మహంత, అరుణాచల్ ప్రదేశ్ నేత గెగాంగ్ అపాంగ్ తదితరులు హాజరవుతున్నారు.

ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. కోల్‌కతా ర్యాలీ తరువాత ఏపి రాజధాని అమరావతిలో మరో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాజధాని పరిధిలోని గుంటూరు, కృష్ణాజిల్లాలకు కలిపి అమరావతిలో ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో జాతీయ నేతలందరినీ ఆహ్వానించాలని నిర్ణయించింది.

అమరావతి ధర్మపోరాట దీక్ష అనంతరం ఎన్నికలలోపు మిగతా రాష్ట్రాలలో కూడా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఆయా పార్టీల బలాబలాల ఆధారంగా ప్రధాని అభ్యర్ధి ఎవరనేది అప్పుడు నిర్ణయించుకుంటారు.