రివ్యూ : మంజులకి ‘నచ్చిందే’ తీసింది

238
సీనియర్ నటుడు కృష్ణ వారసురాలు, మహేశ్ బాబు సోదరి మంజుల దర్శకురాలిగా మారి తీసిన చిత్రం ‘మ‌న‌సుకు న‌చ్చింది’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ప్రేక్షకులకు నచ్చిందో లేదో చూద్దాం.
కథేమంటే..
సూరజ్ (సందీప్ కిష‌న్‌) నిత్య (అమైరా ద‌స్తూర్‌) ఇద్ద‌రూ బావా మ‌ర‌ద‌ళ్ళు. చిన్న‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్‌. వాళ్ళ స్నేహం చూసిన ఇంట్లో వాళ్ళు ప్రేమ అని ఫిక్స‌యి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసుకుంటారు. అయితే పెళ్ళి వద్దనుకున్న ఇద్ద‌రూ క‌ల‌సి క‌ట్టుగా  గోవా వెళ్ళిపోయి చెరొక‌ర్ని ప్రేమించేస్తారు. తీరా త‌మ మ‌న‌సులో ఉన్న‌ది వారిద్దరే అని తెలుసుకుంటారు.
ఎలా ఉందంటే ..
ఈ లైన్ కి ‘ప్ర‌కృతిపై ప్రేమ’ అనే కాన్సెప్ట్ కలిపి ఎన్ని విధాలా హింసించాలో అన్ని విధాల హింసించేసారు. ఈ ప్ర‌కృతిని ప్రేమించండి, చెట్టుతో మాట్లాడండి అంటూ ఒకటే రుద్దుడు. ద‌ర్శ‌కురాలికి ప్రకృతి అంటే ఇష్టం, ప్ర‌కృతిని ప్రేమ‌తో మిక్స్ చేసి ఫ్రెండ్ షిప్‌తో క‌ల‌గ‌లిపి, మెడిటేష‌న్ కోటింగ్ ఇచ్చి సినిమా తీసింది, కానీ ఆ పాయింట్ జ‌నాలకు న‌చ్చుతుందా, లేదా? అనేది మాత్రం చూడ‌లేదు. ఒక్క స‌న్నివేశంలోనూ డెప్త్ లేదు. ఆ ప్రేమ‌లో ఫీల్ లేదు. కాసేపు ఫొటోగ్ర‌ఫీ అంటాడు. ఇంకాసేపు ప్ర‌కృతి అంటాడు. కాసేపు స్నేహం ఇంకాసేపు ప్రేమ‌. క్యారెక్ట‌ర్ల‌లోనే కాదు, ఈ క‌థ‌ రాసిన విధానంలోనూ క్లారిటీ లేకుండా పోయింది. మంజుల ఫ్యామిలీ గోవాకి వెళ్ళి కాల‌క్షేపం కోసం సందీప్ కిష‌న్‌నీ, అమైరా దస్తూర్ ని, కెమెరాని తీసుకెళ్ళి త‌మ‌కు నచ్చిందేదో తీసేసి, తెర‌పై బొమ్మ‌వేసిన‌ట్టు అనిపించింది.
ఎవరెలా..
సందీప్ కిష‌న్ మామూలుగానే కాస్త ఓవ‌ర్ చేస్తుంటాడు. ఈసినిమాలో అది ఇంకాస్త ఓవ‌ర్ అయ్యింది. ఏడుపు సీన్ల‌లో మాత్రం చేతులెత్తి దండం పెట్టాల‌నిపిస్తుంది. అమైరా దస్తూర్, త్రిధా చౌధరి ఎర్ర‌గా, బుర్ర‌గా ఉన్నారు. స్విమ్ సూట్లు, లిప్ లాక్ సీన్ మాత్రం చూపించారు. మంజుల ద‌ర్శ‌కురాలిగా, క‌థ‌కురాలిగా తేలిపోయింది. ఆమె అనుభ‌వ రాహిత్యం క‌నిపించింది.
ఫైనల్ గా ..
న‌చ్చింది న‌చ్చిన‌ట్టు తీయ‌డం క‌ళ‌, మ‌న‌కు న‌చ్చింది ఎదుటివారికి నచ్చేలా తీయగలిగితేనే ఇంకా కళకళలాడుతుంది.