ఒక అజెండాతో ఏపీకి వస్తారట.!

223

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలిగిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు  ఆయ‌న ఆశించిన ప‌ద‌వులు రాలేద‌ని, పార్టీని త‌ప్పుబ‌ట్ట‌డం మొద‌లుపెట్టి తెదేపాకి దూరమయ్యారు. ఇప్పుడేమో ఏపీలో టీడీపీ ఓట‌మికి కృషి చేస్తానంటూ ఆయ‌నో అజెండాతో ఆంధ్రాకి వ‌స్తానంటున్నారు.

వ‌చ్చే నెల 11న తిరుమ‌ల వ‌స్తాన‌నీ, చంద్ర‌బాబును ఓడించాలంటూ దేవుడిని మొక్కుకుంటానని మోత్కుప‌ల్లి తాజాగా మ‌రోసారి విమ‌ర్శించారు. ద‌ళితుల‌కు చంద్ర‌బాబు ద్రోహం చేసార‌నీ, ఇప్పుడు వారి ఓట్ల‌ను దండుకోవ‌డం కోస‌మే ద‌ళిత తేజం అనే కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. మాల‌, మాదిగ‌లు చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు. ముందుగా ద‌ళితుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన త‌రువాత ఆ కార్య‌క్రమానికి చంద్ర‌బాబు వెళ్ళాలంటూ డిమాండ్ చేశారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ద‌ళిత తేజం కార్య‌క్ర‌మంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు ద‌ళిత ద్రోహి అన్నారు. వారి ఓట్ల కోసం మ‌రోసారి పాకులాడుతున్నార‌న్నారు. క్యాబినెట్ లో ఉన్న ద‌ళిత మ‌హిళ‌ను తీసేసార‌నీ, బ్యాక్ లాగ్ పోస్టులు భ‌ర్తీ చెయ్య‌లేద‌నీ, ద‌ళితుల పుట్ట‌ుక‌నే అవ‌మానించార‌నీ, రాష్ట్రంలో ద‌ళితుల‌పై దాడులు జ‌రిగితే స్పందించ‌ని ద్రోహి అంటూ విమ‌ర్శించారు.

ఎమ్మెల్యే రోజా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఒకే అంశంపై ఒకేలా ముఖ్యమంత్రిని  విమ‌ర్శించ‌డం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. మోత్కుప‌ల్లి ఏపీ ప‌ర్య‌ట‌న‌కు బ్యాక్ గ్రౌండ్ ఏర్పాట్లు వైకాపా చేస్తోంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. తెదేపా నుంచి మోత్కుప‌ల్లి బ‌య‌ట‌కి రాగానే వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో చంద్ర‌బాబును విమ‌ర్శించేవారంద‌రినీ ఆంధ్రాకు దిగుమ‌తి చేసుకునే ప‌నేదో వైకాపా నేతలు చేస్తున్న‌ట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.