రివ్యూ : పేరులో ‘బ్రాండు’ ఉంటేనే సరిపోదు

152

దర్శకుడు మారుతి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘బ్రాండు బాబు’. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు బుల్లితెర నటుడు ప్రభాకర్ దర్శకుడు. తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘నెక్ట్స్‌ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా బ్రాండ్‌ బాబుతో వచ్చాడు.

కథేమంటే..

డబ్బున్న వాళ్ళు తప్ప పేదవారు, మధ్యతరగతి వారు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకు డైమండ్ బాబు (సుమంత్‌ శైలేంద్ర)ను  తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్‌దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన ‘డైమండ్‌’ తన బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.  హోం మినిస్టర్‌ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ (ఈషా రెబ్బ)తో ప్రేమలో పడతాడు. తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు.? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్‌ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

టీవీ సీరియళ్ళను డైరక్ట్ చేసే ప్రభాకర్ సినిమాను డైరెక్ట్ చేస్తే ‘బ్రాండ్ బాబు’ మాదిరిగా ఉంటుంది. సినిమా స్మూత్ గానే టేకాప్ అవుతుంది. హీరో ప్రేమ వ్యవహారం మొదలయిన దగ్గర నుంచి సినిమా గాడి తప్పుతుంది. ఇద్దరు అమ్మాయిలను చూసి ఒకళ్లతో అనుకుని మరొకరితో ప్రేమలో పడిన వ్యవహారం సినిమాలో హీరోకి కాకుండా, డైరక్టర్ కు క్లారిటీ మిస్ అన్నట్లు సాగుతుంది. ఏదో చేద్దామనుకుని, మరేదో చేయబోయి, ఇంకేదో చేసారు. అసలు హీరో తండ్రిది బ్రాండ్ పిచ్చా?  ఇగోనా? అనేదే క్లారిటీ లేదు. హీరో కుటుంబం సంఘ బహిష్కరణ వ్యవహారానికి లాజిక్ అసలే ఉండదు. ఆ పరిస్థితిలో మహా కోటీశ్వరులు విదేశాలకో, మరో రాష్ట్రానికో వెళ్ళలేరా.? నగరం దాటి వెళ్ళకూడదని చెప్పలేదు కదా.

హీరో పక్కన ఇద్దరు అసిస్టెంట్లు పంచ్ లు, జోక్ లు బి సి సెంటర్ల ఆడియన్స్ కోసం తయారుచేసుకున్నారనిపిస్తుంది.  తొలిసగంమే బోలెడంత లెంగ్త్ వున్నట్లు అనిపిస్తుంది. బ్రాండ్..బ్రాండ్ అని వినిపిస్తూ వుంటే బేండ్ వాయిస్తున్నట్లు అనిపిస్తుంది.  భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో వారి చర్యల ద్వారా వచ్చే సమస్యలలో ఫన్ పుడుతుంది. కానీ ఇక్కడ పదే పదే బ్రాండ్..బ్రాండ్ అంటూ ఉంటారు. హీరోయిన్ ఈషా పేదింటి అమాయి అయితే మాత్రం డీలా మొహం వేసుకుని ఉండాలా.?

ఎవరెలా..

సుమంత్ శైలేంద్ర బాగానే చేసాడు ఎక్కడా తడబాటు లేదు. ఈషా కూడా సరే. మురళీ శర్మదే అసలు పాత్ర. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు. చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్‌ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా  ఓవరాల్‌గా మరోసారి సినిమాకు ప్లస్‌ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఫైనల్ గా..

మారుతి ఇలాంటి సినిమాలకు కథలు ఇవ్వటం మానేస్తే బెటర్. కథ అమోఘం, అద్భుతం అయి ఉంటే ఇమేజ్ ఉన్న హీరోతో ఈపాటికి తీసేవాడు కదా. మరి ప్రభాకర్ కి ఇచ్చాడంటే నిర్మాతలు ఎక్కడ ‘లాజిక్’ మిసయ్యారో.? బ్రాండు పేరు వాడితే సరిపోదు, సినిమా కూడా చెప్పుకునేంత ‘బ్రాండు’ ఉండాలి కదా.