5శాతంపై ముద్రగడ నాట్ హ్యాపీ.!

107

కాపులకు ఐదుశాతం రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తూ బిల్లును చంద్రబాబు స‌ర్కారు ఆమోదించటంపై కాపు ఉద్య‌మ నేతల స్పంద‌న మ‌రోలా ఉంది. కంటితుడుపు చ‌ర్య‌గా ముఖ్య‌మంత్రి తాజా నిర్ణ‌యం ఉందంటూ కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అసంతృప్తి వ్య‌క్తం చేసారు. ఐదు శాతం రిజ‌ర్వేష‌న్లు త‌మ‌కు ఎన్న‌టికీ ఆమోద‌యోగ్య‌మైన నిర్ణ‌యం కాద‌న్నారు. పల్స్ సర్వేలో కూడా కొంతమంది అభిప్రాయాలను మాత్రమే తీసుకున్నారన్నారు.

శాస‌న స‌భ‌లో హ‌డావుడిగా బిల్లు ప్ర‌వేశ‌పెట్టేసి, ఆమోదించిన మాత్రాన స‌రిపోద‌నీ, దీని వ‌ల్ల‌ కాపుల‌కు ఒరిగేది ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను తొమ్మ‌ిదో షెడ్యూల్ లో చేర్చిన‌ప్పుడే త‌మ‌కు నిజ‌మైన పండుగ అని ముద్ర‌గ‌డ అభిప్రాయ‌ప‌డ్డారు. తాజా రిజ‌ర్వేష‌న్లు కాపులు పోరాట ఫ‌లిత‌మ‌ని చెప్పారు. తమ ఉద్య‌మం వెన‌క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఉన్నార‌నే త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం చాలా బాధాక‌ర‌మైన విష‌యమన్నారు. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోమ‌ని అడిగితే లేనిపోని వంక‌ల‌తో ఇత‌రుల‌ను అవ‌మానించే ప‌ని చెయ్యొద్ద‌న్నారు.

ఏదేమైనా తెదేపా స‌ర్కారు ప్ర‌క‌టించిన నిర్ణ‌యంపై ముద్ర‌గ‌డ సంతృప్తిగా లేరు. ఇత‌ర కాపు సంఘాల నేత‌లు కూడా ఈ నిర్ణ‌యంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 శాతం కాపులు ఉంటే, ఈ 5శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఏ విధంగా ఎవ‌రికి వ‌ర్తింప‌జేస్తార‌ని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణ‌యంపై ఎవ‌రైనా కోర్టుకు వెళ్తే ప‌రిస్థితి ఏంట‌నీ, కాబ‌ట్టి దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  అయితే, ముద్రగడ తదుపరి కార్యాచరణ ఏమిటనేది దానిపై ఎలాంటి స్పష్టతా లేదు.