ముద్రగడకు రాష్ట్రం కంటే రిజర్వేషన్లే ఎక్కువ

96
కాపు ఉద్యమనేత మరోసారి తెరపైకి వచ్చారు. మ‌రోసారి ఉద్య‌మానికి సిద్ధంగా ఉండాలంటూ కాపు సంఘాల‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పిలుపునిచ్చారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై ప్ర‌భుత్వం ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేసారు. కాపులు చేసిన ఉద్య‌మం ఫ‌లితంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ట్టు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు  నిర్ణయం తీసుకున్నారనీ, అయితే ఆ నిర్ణ‌యాన్ని వెంట‌నే అమ‌ల్లోకి తెచ్చే విధంగా కృషి చేయాల‌నీ, మార్చి నెలాఖ‌రులోగా దానికో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌న్నారు. అప్ప‌టికీ ఓ స్ప‌ష్ట‌త రాక‌పోతే మ‌రోసారి రోడ్ల మీద‌కి వ‌చ్చి ఉద్య‌మించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.
ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే తమ జాతి బిడ్డ‌లు రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వచ్చింద‌న్నారు. కాపుల కోసం ఉద్య‌మం చేస్తున్న తాను, త‌న కుటుంబం చాలా అవ‌మానాలు ప‌డాల్సి వ‌చ్చింద‌నీ, గోదావ‌రి జిల్లాల్లో కాపుల‌ను చాలా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. విభ‌జ‌న త‌రువాత కేంద్రం నుంచి ఆంధ్రాకు రావాల్సిన‌వేవీ పూర్తి స్థాయిలో రావాలంటే జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలంటే అన్ని పార్టీలూ, నేత‌లూ, ప్ర‌జ‌లూ క‌లిసి నిల‌వాల్సిన స‌మ‌యంలో కూడా ముద్ర‌గ‌డ స్పంద‌నఇలా ఉంది.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ ప్ర‌త్యేక హోదా కోసం, కేంద్ర కేటాయింపుల అంశ‌మై ప‌వ‌న్ నాయ‌క‌త్వం స‌రిపోద‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో కేవలం కాపు ఉద్య‌మ నేత‌గానే ముద్ర‌గ‌డ ఆలోచిస్తున్నారు. పోరాటానికి ప‌వ‌న్ నాయ‌క‌త్వం చాలదు, తెదేపా నేతలు రాజీనామా చేయాలని అంటున్న ఆయన మాత్రం రాష్ట్ర ప్ర‌యోజనాల కోసం పోరాటానికి సిద్ధం అని మాత్రం చెప్ప‌డం లేదు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే సందిగ్ధంలో ఉన్న ఈ స‌మ‌యంలో ముద్ర‌గ‌డ వ్య‌వ‌హార శైలి ప్ర‌శ్నార్థ‌కంగా ఉంది.