పురుషుల కోసం కూడా ‘కమీషన్’ అడుగుతున్నారు

382

మహిళలకు మహిళా కమిషన్ ఉన్నట్టుగానే, మ‌గాళ్ళ కోసం పురుష క‌మిష‌న్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఏపీ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు, ఈ మేర‌కు ప్ర‌ధానికి ఓ లేఖ రాసాన‌ని కూడా చెప్పారు.

ఇటీవల ఏపీలో పెళ్ళయిన కొన్ని రోజుల‌కే భ‌ర్త‌ను చంపించేసిన భార్య‌, బైక్ మీద వెళ్తూ భ‌ర్త పీక కోసి చంపిన భార్య‌ లాంటి ఘటనలు సంచలనం రేకెత్తించాయి. ఈ అంశంపై నన్నపనేని మాట్లాడుతూ స‌మస్య అంతా టీవీ సీరియ‌ల్స్ వ‌ల్ల‌నే వ‌స్తోంద‌నీ, భ‌ర్త‌ల‌ను ఎలా చంపాలీ, ఏం చెయ్యాల‌నేది వారు చాలా జాగ్ర‌త్త‌గా చూపిస్తున్నార‌న్నారు. భ‌ర్త‌ల‌నీ, ప్రేమికుల‌నీ, తండ్రిని చంప‌డం వంటివి చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇవ‌న్నీ చూసి కొంత‌మంది ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నార‌న్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో భార్య‌ల చేతుల్లో బ‌లైన భ‌ర్త‌ల కుటుంబాల‌ని తాను క‌లుస్తాన‌నీ, పరామ‌ర్శించి వారికి అండ‌గా నిల‌బ‌డ‌తానన్నారు. ఇలాంటి ప‌రిస్థితులలో పురుష క‌మిష‌న్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి రోజులు వచ్చాయంటే బాధ‌గా ఉందన్నారు. భార్యా బాధిత సంఘాల‌ను తాను హైద‌రాబాద్‌, రాజ‌మండ్రి వంటి ప్రాంతాల్లో చూసాన‌న్నారు. ప్ర‌భుత్వం స్పందించి పురుష క‌మిష‌న్ వేయాలని డిమాండ్ చేసారు.

టీవీ సీరియ‌ల్స్ కి కూడా సెన్సార్ పెట్టాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. న‌న్న‌పనేని వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా సంఘాలు ఏమంటాయో చూడాలి. పురుషుల‌పై దాడులు పెరిగిన నేపధ్యంలో క‌మిష‌న్ అవ‌స‌ర‌మా లేదా అనే దానిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల్లోకి హింసా ప్ర‌వృత్తి పెరుగుతుందనేది వాస్తవం.