అభ్యర్ధుల ప్రకటనకు అధినేత అనుమతి ఉందా.?

34

కర్నూలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు తెదేపా అభ్యర్థులను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కర్నూలు పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని వారిని అఖండ మెజార్టీతో గెలిపిచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

కర్నూలులో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన లోకేష్ అభ్యర్థుల ప్రకటన చేయడంతో తెదేపా నేతలే షాకయ్యారు. టిక్కెట్లు ఖరారు చేసిన ఇద్దరూ వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారే. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానంలో తాను పోటీ చేస్తానని కొద్ది రోజులుగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ తరుణంలో లోకేష్ ఎస్వీ మోహన్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తూ ప్రకటన చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు తెరతీసింది. కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీకి పలువురు తెదేపా సీనియర్లు ఆసక్తిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరులు ఈ సీటు కోసం ప్రతీ సారి పోటీ పడుతూంటారు. ఇప్పుడీ సీటును బుట్టా రేణుకకు ఖరారు చేయడంతో కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉందని తెదేపాలోనే వినిపిస్తోంది.

లోకేష్ టిక్కెట్లను ఖరారు చేస్తూ చేసిన ప్రకటనను తెదేపాలో కొందరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు సర్వేల మీద సర్వేలు చేయించుకుని ప్లస్సులు మైనస్సులు బేరీజు వేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఎవరికైనా టిక్కెట్లపై క్లారిటీ ఇస్తారు. దీంతో లోకేష్ ప్రకటనకు చంద్రబాబు ఆమోదం ఉందా లేదా అన్నదానిపై ఎక్కువగా చర్చలు సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో పార్టీపై పట్టు బిగిస్తున్న నారా లోకేష్ కొన్ని నియోజకవర్గాల్లో వర్గ పోరును దూరం చేయడానికి అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించే వ్యూహం అమలు చేస్తున్నారేమోన్న ఊహాగానాలున్నాయి.