చినబాబు ‘గురి’ కూడా ప్రతిపక్షం వైపే.!

143

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెదేపా చేస్తున్న మంచి ప‌నుల్ని చూసి ఓర్వ‌లేక‌పోతున్నారంటూ ప్ర‌తిప‌క్షాన్ని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విమ‌ర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో వైకాపా నేత‌ల తీరుపై సీరియ‌స్ వ్యాఖ్యలు చేసారు. జ‌రుగుతున్న‌ అభివృద్ధిని ఎవ‌రైనా అడ్డుకుంటారా అంటూ మండిప‌డ్డారు. ఉపాధి హామీ నిధుల‌తో సీసీ రోడ్లు వేస్తున్నారంటూ ఎవ‌రైనా లేఖ‌లు రాస్తారా  అంటూ విమ‌ర్శ‌లు చేసారు.

ఇది ఎంత‌వ‌ర‌కూ న్యాయమో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. నిధులు రాకుండా వారే అడ్డుప‌డ‌తార‌నీ, త‌రువాత నిధులు ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శిస్తారని అన్నారు. ఏనాడూ జ‌ర‌గ‌ని అభివృద్ధి చేసుకుంటున్నామ‌నీ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ప్ర‌ణాళికాబ‌ద్ధ‌మైన కార్యక్ర‌మాలు చేసుకుంటామ‌ని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. ఒక వారం రోజుల కింద‌ట ఇదే అంశ‌మై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఇవే విమ‌ర్శ‌లు చేసారు. వైకాపా నేత‌లు చేసిన ఫిర్యాదుల కాపీల‌తో ప్రెస్ మీట్లు పెట్టారు. ఉపాధి హామీ కూలీల‌కు చెల్లింపులు ఆల‌స్యం కావ‌డానికి కార‌ణం వైకాపా అంటూ మండిప‌డ్డారు.

అంత‌కుముందు కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి కూడా ఇదే టాపిక్ మీద ఓ రెండు పేప‌ర్లు ప‌ట్టుకుని మీడియా ముందుకొచ్చారు. వైకాపా ఫిర్యాదుల మూలంగానే బిల్లులు ఆగిపోయాయ‌నీ, త‌రువాత కేంద్రం ఒక క‌మిటీ వేసింద‌నీ, ఆ క‌మిటీ క్లీన్ చిట్ ఇచ్చేసింద‌నీ, నిధులు త్వ‌ర‌లోనే వ‌స్తున్నాయ‌నీ చెప్పారు. ఉపాధి హామీ ప‌నుల విష‌యంలో వైకాపా నేత‌లు చేసిన‌ ఫిర్యాదుల‌పై తెదేపా చేయాల్సిన విమ‌ర్శ‌ల‌న్నీ అయిపోయాయి. ఇప్పుడు మంత్రి లోకేష్ సీఎం చేసిన విమ‌ర్శ‌లనే కాపీ చేసారు.