ఎన్డీయేదే విజయం ..రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ‘హరివంశ్’

171

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్‌ సింగ్ విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజార్టీ 123 కంటే రెండు ఓట్లు ఎక్కువే వచ్చాయి. విపక్షాల అభ్యర్ధిగా నిలబడిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ 105 ఓట్లతో పరాజయం పాలయ్యారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు అత్యంత సన్నిహితుడయిన హరివంశ్ తొలిసారి రాజ్యసభకు వచ్చారు. అయినప్పటికీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఫలితాలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించగానే అన్ని పక్షాల నేతలు ఆయనను అభినందించారు. 13 మంది ఎంపీలున్న అన్నాడీఎంకే, 9 మంది రాజ్యసభ సభ్యులున్న బిజూ జనతాదళ్ ముందుగానే మద్దతు ప్రకటించడంతో ఎన్డీఏ విజయం ఖరారారయింది.

బిజూజనతాదళ్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నించినా జేడీయూ నేత నితీష్‌కుమార్‌కు మాటిచ్చేసానని ననీన్ పట్నాయక్ కాంగ్రెస్ నేత ఆజాద్‌కు చెప్పారు. తెరాస కూడా అధికారికంగా తమ విధానాన్ని బయటకు చెప్పకపోయినా నేరుగా సభలో ఓటింగ్ ద్వారా వెల్లడించింది.

ఇక భాజపాకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పిన వైకాపా చివరి క్షణంలో యూటర్న్ తీసుకుని ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దీంతో విపక్షాల అభ్యర్థికి ఓట్లు తగ్గిపోయాయి. కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు తృణమూల్‌, తెదేపా, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ, సీపీఐ, జేడీఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. వైసీపీ, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు గైర్హాజరయ్యాయి. రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244 కాగా, 230 సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. విపక్షాల తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌ నుంచి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు తీవ్ర పోటీ ఎదురైందనే చెప్పాలి. పలుమార్లు లెక్కించిన ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థికి 105 ఓట్లు మాత్రమే వచ్చాయి.