కొత్త స్నేహానికి భాజపా ఎత్తులు

109
ఎన్డీయే నుంచి రేపోమాపో తెలుగుదేశం పార్టీ బ‌య‌ట‌కి వ‌చ్చేయ‌డం దాదాపు ఖాయం. ఇప్ప‌టికే, టీడీపీ కేంద్ర‌మంత్రులు రాజీనామా చేసారు. తెలుగు ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ఎంత లైట్ గా తీసుకుంటూ వ‌చ్చినా భాజ‌పా నుంచి మిత్ర‌ప‌క్షాలు దూర‌మౌతున్నాయ‌నే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. దీన్ని మాత్రం భాజ‌పా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టుగా ఉంది.
ఇప్ప‌టికే శివ‌సేన బ‌య‌ట‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెదేపా కూడా అదే దారిలో ఉంది. ఇక‌, మిగిలింది కేవ‌లం అకాలీద‌ళ్ మాత్ర‌మే. ఇలా సంప్ర‌దాయ మిత్ర‌ప‌క్షాలు దూరం కావ‌డం వ‌ల్ల మోడీ అధికారానికి వ‌చ్చే ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ, ఈ క్ర‌మంలో మోడీ, అమిత్ షాల నియంతృత్వ పోక‌డలు పెరుగుతున్నాయనే అభిప్రాయంపై కొంత చ‌ర్చ జ‌రుగుతోంది. భాజ‌పాతో మిత్ర‌ప‌క్షాలు ఇమ‌డ‌లేవ‌న్న విశ్లేష‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా ఒక ప్రాంతీయ పార్టీని ఎన్డీయే మిత్ర‌ప‌క్షంగా చేసుకోవాలనేది మోడీ వ్యూహంగా తెలుస్తోంది.
మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత మ‌ర‌ణం త‌రువాత త‌మిళ రాజ‌కీయాలను తెర‌వెన‌క నుంచి భాజ‌పా నిర్దేశిస్తోంద‌నే విష‌యం తెలిసిందే. ప‌ళ‌నిస్వామి, ప‌న్నీరు సెల్వ‌మ్ వ‌ర్గాల‌ను క‌లిపింది కూడా మోడీ సాబ్ క‌దా. ఆ విష‌యాన్ని ఈ మ‌ధ్య‌నే ప‌న్నీర్ సెల్వ‌మ్ బహిరంగంగా చెప్పారు. అయితే, ఇదేదో య‌థాలాపంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య కాద‌నీ, దాని వెన‌క అన్నాడీఎంకే వ్యూహ‌మూ ఉంద‌నే అభిప్రాయం ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తోంది. నాయ‌క‌త్వ లేమితో అన్నాడీఎంకే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేప‌థ్యంలో ఎన్డీయేలో చేరితే, పార్టీలోని నేత‌లంద‌రూ ఒక తాటి మీదికి వస్తార‌నీ, మోడీ బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఆ విధంగా త‌మ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నార‌ట‌.
అయితే, త‌మిళ‌నాడులో భాజ‌పాపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతున్నా పార్టీ ప్రస్తుత అవ‌స‌రాల దృష్ట్యా భాజ‌పాతో పొత్తు అనివార్యం అనేది కొంత‌మంది అభిప్రాయం. ఇక‌, జాతీయ స్థాయిలో ఇప్పుడు భాజ‌పా అవ‌స‌రం ఏంటంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు దూర‌మైనా త‌మ‌ను శాసించలేవ‌నీ, రాజ‌కీయ అవ‌స‌రాలున్న ప్రాంతీయ పార్టీలు త‌మ‌తో పొత్తు కోసం పాకులాడ‌తాయ‌నే సంకేతాలు ఇవ్వాల‌ని చూస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అన్నాడీఎంకేను చేర్చుకోవాల‌నే ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా టీడీపీ మంత్రులు రాజీనామాలు చేయ‌గా ఖాళీ అయిన మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి అన్నాడీఎంకే నేత‌కు ఇవ్వాల‌నే ప్ర‌తిపాద‌నపై కూడా భాజ‌పా వ‌ర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.