రాజు బాగున్నాడు కాని రాజ్యమే?-NENE RAJU NENE MANTRI ‘MY’VIEW

355

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రూపొందినప్పుడు ప్రేక్షకుడు వాస్తవికతను కోరుకుంటాడు. ఎందుకంటే వర్తమాన పరిస్థితులను ఎప్పటికప్పుడు తాను చూస్తూ ఉంటాడు కాబట్టి ఫాంటసీ ఇలాంటి కథలకు సూట్ అవ్వదు. అందుకే కత్తి మీద సాములాంటి రాజకీయ నేపధ్యం కలిగిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంటే అంత సులభం కాదు. అందుకే మన దర్శకనిర్మాతలు వాటి జోలికి వెళ్ళడమే మానేసారు. శేఖర్ కమ్ముల లీడర్ తో ఒక ప్రయత్నం చేసాడు కాని ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. కాని ఫాం కోల్పోయి తన పూర్వ వైభవం కోసం పోరాడుతున్న దర్శకుడు తేజ మాత్రం ఏరికోరి మరీ సాహసం చేసి ఈ జానర్ ని టచ్ చేసాడు. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా మంచి హైప్ ని క్యారీ చేసిన నేనే రాజు నేనే మంత్రి గురించి నా వ్యూ

కథేంటో 

అన్ని రివ్యూస్ లో కథను చదివి ఉంటారు కాబట్టి దాన్ని విడమరిచి మళ్ళి చెప్పదలుచుకోలేదు. సింగల్ లైన్ లో చెప్పుకుందాం. రాయలసీమలో ఒక చిన్న ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే ఎరువుల వ్యాపారి సర్పంచిగా మొదలుపెట్టి  సిఎం కుర్చీని టార్గెట్ చేసే దాకా అతను చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. వినగానే ఎక్స్ ట్రార్దినరి అనిపించింది కదా. నిజంగా అంత స్కోప్ ఉన్న కథే ఇది. బోనస్ గా ఆ ఎరువుల వ్యాపారి ప్రాణంగా ప్రేమించే భార్య కథ కూడా ఉంది. మరి ఇన్నేసి ఉన్నప్పుడు పైన ఆ హెడ్డింగ్ ఏంటి అనే ప్రశ్నకు సమాధానం విశ్లేషణలో చూడండి

ఎక్కడైనా తేడా కొట్టిందా

బాగా తేడా కొట్టింది. అసలు తేజ కథ చెప్పిన విధానమే సిల్లీగా ఉంది. అంటే ప్రతి సినిమాలోనూ ఉన్నతమైన విలువలు ఉంటాయా అని ప్రశ్నించకండి . పూర్తిగా చదివాక మీకే అవగాహన వస్తుంది. అర్జున్ హీరోగా తీసిన ఒకే ఒక్కడు సినిమా గుర్తుందిగా. ఒక టీవీ రిపోర్టర్ ఒక్క రోజు ముఖ్య మంత్రిగా పనిచేయటం అనే ఊహాజనితమైన పాయింట్ ని చాలా కన్విన్సింగ్ గా శంకర్ తీయటమే కాదు అలా జరగడానికి అవకాశం ఉంది అని మనల్ని ఒప్పిస్తాడు. అది స్క్రీన్ ప్లే తో చేసే గమ్మత్తు. తాను ఒక్క రోజు సిఎంగా బాధ్యతలు చెప్పట్టడం పూర్తయ్యాక ఇక రాజకీయాలు వద్దనుకుని వెనక్కు వచ్చేసిన అర్జున్ ఇంటికి వేలాది లక్షలాది అభిమానులు గుమికూడి తమ సిఎం నువ్వే కావాలి అంటూ నినాదాలు చేస్తారు. చాలా ఎమోషనల్ గా ఉండే ఆ సీన్ కనెక్ట్ అయ్యింది కాబట్టే చివరి గంట అర్జున్ ఫుల్ టైం సిఎం అయినా ఆనందంగా ఒప్పుకున్నారు. తెరమీద అతిశయోక్తిని ప్రేక్షకులను మెప్పించే విధంగా చూపించడం అంటే ఇదే.

ఇప్పుడు ఒకే ఒక్కడు పోలిక ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం చెబుతాను. నేనే రాజు  నేనే మంత్రి క్లైమాక్స్ లో జోగేంద్ర తన నిజ జీవిత కథ చెప్పగానే రాష్ట్రం మొత్తం మీడియాతో సహా కదిలిపోయి అతని కోసం హాహాకారాలు చేస్తూ జైలు ముందు జయహో జోగేంద్ర అంటూ పాటలు పడుతూ ఏకంగా ప్రెసిడెంట్ ఉరిశిక్షకు స్టే విధించే వరకు తెస్తారు. సరే ఇంతా చేసి జోగేంద్ర చేసిన గొప్ప పనులు ఏంటి అంటే తన ఊరి సర్పంచి, ఎమెల్యేను చంపి ఆ పదవుల్లోకి తాను రావడం, తన గుట్టు తెలిసిపోయింది అనే ఒకే ఒక్క కారణంతో మూడు వేల కోట్ల అధిపతి అయిన ఒక పెళ్లి కాని అమ్మాయితో పడక దాకా వెళ్ళడం, తననే నమ్ముకుని ఉన్న బంటు లాంటి వాడిని చిన్న వీడియో చూసి కాల్చి చంపడం, హోం మినిస్టర్ ని చాలా చాలా సింపుల్ గా బకరాని చేయటం, ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రత్యర్థి పార్టీ ప్రతినిధులంతా ఒక బిల్డింగ్ లో ఉంటె దాని బాంబుతో పేల్చేసి వాళ్ళందరిని చంపేయడం, అన్ని దుర్మార్గాలు చేసిన జోగేంద్ర లైవ్ లో ఇవన్ని చెప్పగానే ప్రజల పాలిట దేవుడైపోయి అందరు చప్పట్లు కొడతారు. ఇది సినిమా కాబట్టి సృజనాత్మకత స్వేచ్చతో ఏదైనా చెప్పొచ్చు. కాని కొంతైనా నమ్మశక్యంగా ఉండాలి కదా.

ఇక్కడ లాజిక్స్ ని ప్రశ్నించే ప్రయత్నం చేయటం లేదు. సినిమా లాజిక్ కి కూడా దూరంగా ఉంటేనే సక్సెస్ రేంజ్ పెరుగుతుంది. మహాభారతంలో ఫాంటసీతో కూడిన డ్రామాని జోడిస్తేనే మాయాబజార్ లాంటి క్లాసిక్ తయారయ్యింది. సో ఇలా జరిగి ఉండదా అని నేనే రాజు నేనే మంత్రి సినిమా గురించి అడగటం లేదు. కాని జోగేంద్ర పాత్రను ఎమోషనల్ గా భార్య మీద ప్రేమ అనే పునాది మీద ప్రేక్షకుల మనస్సులో రిజిస్టర్ చేయాలి అని అనుకున్నప్పుడు దేవికా రాణి తో పడక పంచుకున్నప్పుడే ఆ పాత్ర దిగజారిపోయింది .భార్య మీద ఎంత ప్రేమ ఉందొ ఋజువు చేయడానికి ఇంకో అమ్మాయి పక్కన పడుకోవడానికి సిద్ధపడినప్పుడే ఆ పాత్రకు మిగిలిన కొద్దిపాటి గౌరవం కూడా గంగలో కలిసిపోయింది. మరి జోగేంద్రది కొలవలేని ప్రేమ అని చెప్పడానికి ఛాన్స్ ఎక్కడిది. ఒకవైపు కాలి కడియం తాకట్టు పెట్టిన పేద దంపతులకు పిలిచి మరీ సహాయం చేసిన రాధా తన కోసం భర్త కిరాతకంగా మారి హత్యలు చేస్తూ ఉంటె భర్త  ఏం చేసినా కరెక్ట్ అనడం పాత్రలో డిగ్నిటీని దెబ్బ తీసింది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.  ఒకప్పుడు ముఖ్య మంత్రిని కాని, మినిస్టర్ లను కాని ఎంత కామెడీగా, జోవియల్ గా చూపించినా అప్పుడు ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ఏది చూపించినా చెల్లేది. కాని ఇప్పుటి జనరేషన్ కి అవగాహన పెరిగింది. బ్యూరోక్రసి సిస్టం ను దగ్గరి నుంచి గమనిస్తున్నారు. అలాంటప్పుడు రాజకీయం అనేది చాలా ఆషామాషీ వ్యవహారంలా చూపించినప్పుడు ఒన్ చేసుకుని సినిమా చూసే ప్రేక్షకుడికి డైజెస్ట్ కాదు. మరి అందరు తేజ ఈజ్ బ్యాక్ అంటున్నారే అనే కదా మీ డౌట్. నీకు నాకు డాష్ డాష్, కేక, జై, హోరాహోరి లాంటి తేజ సినిమాలతో పోల్చుకున్నప్పుడు ఇది వంద రెట్లు మెరుగ్గా ఉంది అనిపించడం ఆశ్చర్యం కాదు.

ప్రత్యేకంగా కొందరి  గురించి ఇక్కడ ప్రస్తావించాలి. మాటల రచయిత లక్ష్మిభూపాల్ ట్రేడ్ మార్క్ గన్ షాట్ డైలాగ్స్ తో చాలా సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేసారు. స్క్రిప్ట్ లో పరుచూరి వారి సహకారం ఉందని టైటిల్ కార్డ్స్ లో వేసారు కాబట్టి వాళ్ళ ప్రమేయం కథను ఏమైనా ప్రభావితం చేసిందేమో విశ్లేషకుడిగా ఊహను బట్టి చెప్పలేం. క్లైమాక్స్ లో జోగేంద్ర పాత్ర చెప్పిన డైలాగ్స్ లో భూపాలలోని అసలు రచయిత బయటికి వచ్చాడు. చాలా పదునైన సంభాషణలు ఉన్నా కూడా సీన్ ఇంటెన్సిటీ పేలవంగా ఉండటంతో అవి పూర్తిగా కనెక్ట్ అవ్వకపోయే అవకాశం ఉంది. వెంకట్ సి దిలీప్ కెమెరా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. బడ్జెట్ ప్లానింగ్ మాత్రం చాలా తెలివిగా చేయటం వల్ల రిచ్ నెస్ కనపడుతుంది. లెంగ్త్ కాస్త ఎక్కువగా కనిపించడం ఎడిటింగ్ లోపమో లేక దర్శకుడి ఫోర్సో చెప్పలేనట్టుగా ఉంది. అనూప్ రూబెన్స్ ఇలాంటి ఇంటెన్సిటీ బేస్డ్ మూవీకి ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం ఆశ్చర్యమే. చేయించుకుంటే మంచి క్వాలిటీ ఇవ్వగలను అని చెప్పకనే చెప్పాడు.

మరి చేసినోళ్ళ సంగతి

అన్ని నెగటివ్స్ చెబుతున్నారు పాజిటివ్స్ లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకి బలం రానానే. జోగేంద్రగా ఎంత చేయాలో అంతా చేసాడు, ఎంత కోరుకున్నారో అంతా ఇచ్చాడు. బాహుబలిలో భల్లాల దేవాతో సమానంగా జోగేంద్ర పాత్రలో చెలరేగిపోయి నటించాడు రానా. ఇంట్రోలో పంచె కట్టుతో అలా నడిచోస్తూ ఉంటె ఆకర్షించబడని వారు ఉండరు. సిఎంని ఛాలెంజ్ చేసే సీన్లో, శివను చంపాక నిజం తెలుసుకుని బాధ పడే ఎపిసోడ్లో, క్లైమాక్స్ లో తాను చేసిన తప్పులను తానే చెప్పుకుని కనువిప్పు కలిగించే సీన్లో రానాలోని బెస్ట్ యాక్టర్ ని చూస్తాం. కాని గ్రిప్పింగ్ కథ కనక ఈ సినిమాకి పడిఉంటె మరో ఇండస్ట్రీ హిట్ రానా ఖాతాలో పడేదే. చాలా కాలం తర్వాత కాజల్ కు నటించడానికి అవకాశం దక్కింది. ఒక్క యించు చర్మం కనిపించకుండా నిండైన చీరకట్టుతో ఒద్దికగా మెప్పించింది. క్యాథరిన్ త్రెస్సా గాజు బొమ్మలా బిగుసుకుపోయి బాగా నటించింది. అందరి గురించి ప్రస్తావించే స్పేస్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడితో ముగించేద్దాం.

ఇక్కడ విమర్శ అంతా తేజ మీదే కనిపిస్తుంది కాబట్టి దాని గురించి రెండు మూడు పాయింట్స్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. తేజ టాలెంట్ ఇంకా వాడిపోలేదు. తనలో ఇంకా సత్తా ఉన్న విషయం చాలా ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది. కాని జోగేంద్ర జీవిత కథ చెబుతున్నప్పుడు ఇంత అతిశయోక్తికి చోటు ఇవ్వడమే దెబ్బ తీసింది. సినిమా అందరికి నచ్చదు అనే పాయింట్ లేదు ఇక్కడ. రానాను,తేజను అభిమానించే కళ్ళకు ఇందులో లోపాలు కనపడవు. అది ఏ హీరో విషయంలో అయినా సహజమే. చాల ప్లాన్డ్ గా చేసిన మార్కెటింగ్, తెలివిగా కట్ చేసిన ట్రైలర్ ఒక రకమైన పాజిటివ్ ఫీలర్లు నింపేసాయి కాబట్టి పూర్తిగా నిరాశ చెందే అవకాశాలు ఉండకపోవచ్చు. కాని ఏదో వెలితితో ఆలోచిస్తూ సినిమా అయిపోయాక బయటికి వస్తున్నాం అంటే ఎక్కడో లోపం ఉన్నట్టే. కావాలంటే టెస్ట్ చేయండి.

నేనే రాను నేనే మంత్రి-రాజు బాగున్నాడు, రాజ్యమే గందరగోళంగా ఉంది

—-రవీంద్రనాథ్ శ్రీరాజ్