‘ఎఫ్2’ రివ్యూ : కొంచెం లాగినా బోల్డు ‘ఫన్’

404

వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌ 2’. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా  తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజయ్యింది. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలను సినిమా అందుకుందా.? చూద్దాం.

కథేమంటే..

ఒక ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేసే వెంకీ (వెంకటేష్)కి అమ్మా నాన్నలతో పాటు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా లేకపోవటంతో హారిక (తమన్నా) అతన్ని పెళ్ళిచేసుకుంటుంది. పెళ్ళి తరువాత వెంకీ జీవితం భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్‌)ని వరుణ్‌ యాదవ్‌ (వరుణ్ తేజ్) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్‌, హనీతో పెళ్ళికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్ళి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వెంకీ, వరుణ్‌లలో ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతుంది. ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్‌) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్‌ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్‌ వెళ్ళిపోతారు. హారిక, హనీలు యూరప్‌లో ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్ళి చేసుకునేందుకు రెడీ అవుతారు. వెంకీ, వరుణ్‌లు ఏం చేసారు..? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

వరుస విజయాలతో ఫాంలో ఉన్న అనిల్‌ రావిపూడి పండక్కి మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కడుపుబ్బా నవ్వించాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. ఒక‌ భార్యా బాధితుడు, మ‌రొక ప్రేయ‌సి బాధితుడి ఫ‌స్ట్రేష‌న్ ఈ సినిమాకి మూలం. ఇంట్రవెల్ బ్యాంగు ఇచ్చి, ఆడియ‌న్స్‌ని టీ-కూల్ డ్రింగుల‌కు బ‌య‌ట‌కు పంపించేట‌ప్పుడు కూడా వెంకీ త‌న‌దైన స్టైల్‌లో న‌వ్విస్తాడు. సెకండాఫ్ ఇంకా బాగుంటుంద‌ని, మ‌రిన్ని న‌వ్వులు ఏరుకోవ‌చ్చ‌ని స‌గ‌టు అభిమాని ఆశ ప‌డ‌డంలో త‌ప్పులేదు. కానీ క‌థ‌ని యూర‌ప్ తీసుకెళ్ళాక‌ ఏం చేయాలో అర్థం కాలేక‌ ఏమొస్తే అది చేసి, ఏం అనిపిస్తే అది తీసేసాడు. ప్ర‌కాష్ రాజ్‌ పాత్రకి ఇచ్చిన ‘గుండ‌మ్మ‌క‌థ‌’ పాయింట్‌ని స‌రిగా వాడలేదు. వెన్నెల కిషోర్‌పాత్ర‌ని రంగంలోకి దింపారు. కానీ దాన్నీ స‌రిగా వాడుకోలేదు. చివ‌ర్లో అన‌సూయ‌ని తీసుకొచ్చి ఓ పాట‌కు స్టెప్పులేయించారు. సెకండాఫ్ లేకుండానే ఈ సినిమా మొద‌లెట్టేసాం అని దిల్ రాజు ఈ మ‌ధ్య ఒప్పుకున్నాడు. అందుకే సెకండాఫ్‌లో ప‌ట్టు స‌న్న‌గిల్లిందేమో అనిపిస్తుంది.

ఎవరెలా..

వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పర్ఫామెన్స్‌, డైలాగ్‌ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ పర్ఫామెన్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది. వరుణ్ తేజ్‌ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్‌గా అలరించింది. ఫస్ట్ హాఫ్‌లో మెహరీన్‌ నటన కాస్త అతిగా అనిపించినా పరవాలేదనిపిస్తుంది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేసారు.

ఫైనల్ గా ..

ఫ్రస్ట్రేషన్ అయితే తెప్పించలేదు కానీ బోల్డు ‘ఫన్’ ఉంది