మోదీ గారూ ..30 రోజులు పూర్తయ్యాయి ..కానీ

523

నోట్ల రద్దు అంకానికి సరిగా నెలరోజులు ..కొన్ని రోజులు ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని ప్రధాని మొదలు పలువురు కేంద్ర మంత్రులు, రిజర్వు బ్యాంకు అధికారులు పదేపదే చెప్తూ వచ్చినా నెల రోజులు దాటినా నగదు కష్టాలు ఏమాత్రం తగ్గలేదు. క్రమంగా నగదు విత్‌డ్రా పరిమితిని పెంచుతామని చెప్పిన కేంద్రం పరిమితిని గణనీయంగా తగ్గించి వేసింది.

గతనెల 9వ తేదీన మొదలైన నగదు కష్టాలతో దేశమంతా దాదాపు ఆర్థిక అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నది. కొన్ని రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఆశించిన సామాన్యుల ఆశలు అడియాసలయ్యాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో గత పక్షం రోజులుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. బ్యాంకుల నుంచి విత్‌డ్రాయల్ పరిమితిని కొద్ది రోజుల వరకు రోజుకు రూ.10వేల వరకు, వారానికి రూ.20వేల వరకు విధిస్తున్నట్టు చెప్పారు. ఇక ఏటీఎంల నుంచి రోజుకు రూ.2వేలు తీసుకోవచ్చని, వారం తరువాత దానిని రూ.4వేలకు పెంచుతామని తెలిపారు. ఇప్పటికి బ్యాంకుల్లో రోజుకు రూ.4,000కు మించి ఇవ్వకపోగా, ఏటీఎంలలో రూ.2,500కు మించి రావడం లేదు.

రాష్ట్రంలో కూడా ఏ బ్యాంకులో కూడా ఖాతాదారునికి రోజుకు రూ.4,000కు మించి ఇవ్వడం లేదు. నగదు ఉన్న ఏటీఎంల ఎదుట ప్రజలు పడిగాపులు గాస్తూ రూ.2,500 కోసం వేచి చూస్తున్నారు.  నగదు చేతికొచ్చాక రూ.2,000 నోట్లకు చిల్లర దొరకక అష్టకష్టాలు పడుతున్నారు. సామాన్యులు గంటల తరబడి ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతుండగా మరోవైపు దేశం నలుమూలలా అక్రమార్కుల వద్ద వందల కోట్ల రూపాయల్లో కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి.

చేతిలో డబ్బుల్లేక ప్రజలు ..కొనుగోళ్ళు లేక వ్యాపారాలు 30 రోజులుగా ముప్పు తిప్పలు పడుతూనే ఉన్నారు. నల్లధనం అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని తాజాగా నగదురహిత లావాదేవీల పాట పాడుతున్నారు. మోదీ గారు చెప్పిన 50 రోజుల్లో 30రోజులు అయిపోయాయి. ఇంకా ఇరవై రోజులు ఇంకెన్ని పడాలో..ఇంకెన్ని చూడాలో..!