‘ఇమ్రాన్’ స్నేహితుల జాబితాలో ‘మోడీ’ లేనట్లేనా.?

445

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగా ఈ నెల 11న ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఎవరెవర్ని పిలవాలన్నదానిపై ఇమ్రాన్ కసరత్తు చేసారు.

భారత్‌ నుంచి ప్రధానమంత్రి మోడీకి ఆహ్వానం అందుతుందని కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఆయన తన స్నేహితులైన కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌, సిద్ధూలను ఆహ్వానించారు. మోడీని అహ్వానిస్తారంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. రాజకీయ పరంగా ఎవరెవర్ని ఆహ్వానించాలనే దానిపై విదేశాంగ అధికారులు నిర్ణయిస్తారని ప్రకటించారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేసినపుడు సార్క్ దేశాల అధినేతలందర్నీ ఆహ్వానించారు. ఈ జాబితాలో పాకిస్థాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నారు. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా మోడీ పాకిస్థాన్‌కు వెళ్ళి నవాజ్ షరీఫ్ కుటుంబంలో ఓ శుభకార్యంలో పాల్గొని వచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇమ్రాన్ ఖాన్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. .

ఇమ్రాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నా ఆయన స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేరు. ముఖ్యంగా అంతర్జాతీయ అంశాల్లో ఇమ్రాన్ నిమిత్తమాత్రుడేనన్న ప్రచారం జరుగుతోంది. సైన్యం గుప్పిట్లో ఇమ్రాన్ ఉండే అవకాశం ఉంది. టెర్రరిస్టు గ్రూపులు కూడా ఇమ్రాన్ గెలుపు కోసం సహకరించాయి కాబట్టి వారి మాటలనూ జవదాటలేరు. మోడీని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలా వద్దా అన్నది మిలటరీపైనే ఆధారపడి ఉంది.