తెలుగువాడిగా పుట్టటమే మంగళంపల్లి చేసిన పొరపాటు

692

తెలుగువాడిగా పుట్టటమే మంగళంపల్లి చేసిన పొరపాటు
చాలాకాలం క్రితం…బళ్ళారి పట్టణం లో సంగీత కచేరి చేస్తున్నారు మంగళంపల్లి. ఇంతలో ప్రేక్షకుల నుంచి ఒకామె లేచి “అమృతవర్షిణి” రాగం లో ఒక పాట పాడమని మంగళంపల్లి ని కోరారు. బాలమురళి ఆమె కోరిక మన్నించి అమృతవర్షిణి రాగం ఆలపించారు. ఆశ్చర్యం!!! పాట ముగిసే లోపల ఆ చుట్టుపక్కల భయంకరమైన వర్షం ముంచెత్తింది. అదీ మంగళంపల్లి సంగీతం లోని దైవత్వం!! మైసూర్ నుంచి జయశ్రీ అనే మహిళ ఇవాళ హిందూ పేపర్లో ఈ అనుభవాన్ని రాశారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, బెంగాల్ నుంచి సంగీతాభిమానులు గొప్ప నివాళులు అర్పించారు… ఒక్క తెలుగువారు తప్ప!!

ఆయన తెలుగు వారు అయినా మద్రాస్ లో స్థిరపడ్డారు. అందుకని తమిళ ప్రభుత్వం పట్టించుకోలేదు. తమిళనాట స్థిరపడటం తో తెలుగు ప్రభుత్వం పట్టించుకోలేదు. సంగీతానికి భాషా భేదాలు, ఎల్లలు లేవు అని గొప్పలు చెప్పుకునే దేశం లో ఒక సంగీత కళాకారుడికి జరిగిన సన్మానం ఇదీ…

ఒక క్రికెటర్, టెన్నిస్ ఆటగాడు తన పదిహేనో ఏట క్రీడల్లోకి వస్తాడు. పది పదిహేనేళ్ళు రాణిస్తాడు. ముప్ఫయి ఏళ్ళు వచ్చేసరికి అతని క్రీడా జీవితం ముగిసిపోతుంది. ఇక శేష జీవితం మొత్తం గతవైభవం తోనే జీవిస్తాడు. ఈ లోపలే అతనికి దేశం లో ఉన్న పురస్కారాలు మొత్తం వస్తాయి. అతగాడికి భారతరత్న ఇవ్వాల్సిందే అని రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తాయి. రాజ్యసభ సభ్యత్వాలు, లోక్ సభ టికెట్లు దొరుకుతాయి.

No proper tribute to mangalampalli balamuralikrishna by telugu statesతెలుగువాడిగా పుట్టటమే మంగళంపల్లి చేసిన పొరపాటు

ఒక సంగీత కళాకారుడు తన పదో ఏటో, పన్నెండో ఏటో సంగీత సామ్రాజ్యం లోకి అడుగుపెడతాడు. మరణించిన దాకా అద్భుత ప్రతిభను చూపిస్తాడు. కాలం గడిచేకొద్దీ అతని ప్రతిభాపాటవాలు ఇంకా ఇంకా విశ్వరూపం దాలుస్తాయి తప్ప వన్నె తగ్గవు. అయినా ఒక పద్మశ్రీ కోసం అతను రాజకీయ నాయకుల ను బతిమాలుకోవాలి..!! 80 ఏళ్లపాటు సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుల వెలిగిన బాలమురళి కృష్ణ కు భారతరత్న లేదు మరి…ఆయన ఎంజీయార్ కంటే, సుబ్బులక్ష్మి కంటే, లతామంగేష్కర్ కంటే తీసిపోయాడా?

పాతికేళ్ళక్రితం బాలమురళి సంగీతం థెరపీ తో కొన్ని రకాల వ్యాధులు నయం చెయ్యవచ్చు అని కొన్ని ఏళ్లతరబడి చేసిన పరిశోధనను సీడీలుగా చెయ్యాలని ప్రతిపాదిస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. ఆర్ధిక వెసులుబాటు లేక ఆ ప్రాజెక్ట్ మూలన పడ్డది. అదే ఒక సానియా, ఒక సింధు లాంటి వాళ్ళు పదినిముషాలు సాగే ఒక ఆటను గెల్చి పతాకం తెస్తే కోట్లాది రూపాయల నజరానాలు, ఇంటి స్థలాలు, గృహాలను పోటీలు పడుతూ ప్రకటిస్తాయి మన ప్రభుత్వాలు..

నిన్న ఆయన అంత్యక్రియలు జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వెళ్లి కనీస గౌరవం ప్రకటించలేదు…ఆంద్ర నుంచి ఒక మంత్రి వెళ్లి చూసి వచ్చారు..తెలుగు సినిమా రంగం నుంచి ఒక్క హీరో వెళ్ళలేదు. లలితకళల పట్ల మనకున్న గౌరవం అదీ మరి…

బాలమురళి, మధునాపంతుల, పినాకపాణి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ , సినారె, ఎస్వీ రంగారావు లాంటి గంధర్వులు తెలుగువారిగా పుట్టడం వారి దురదృష్టం కదూ…

– ఇలపావులూరి మురళి మోహన రావు