‘చేయి’ కలిపే ముందు ప్రసంగంలో మెరుపుల్లేవ్.!

460

కాంగ్రెస్‌లో చేరికను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయుల ముచ్చటలో రేవంత్‌ రెడ్డి ప్రసంగం పదునుగా లేదు. తెలుగుదేశం నుంచి ఎందుకు రావలసివచ్చిందో దీర్ఘంగా వివరించడం, చంద్రబాబుపై గౌరవ ప్రకటన, తెరాసపై విమర్శలు, కాంగ్రెస్‌లో చేరే కారణాల వివరణ అంతగా పొందలేదు. ప్రసంగంలో వాస్తవానికి తెలుగుదేశం గురించి ఎక్కువసేపు మాట్లాడారు.

కెసిఆర్‌ను విమర్శించడానికి కావాలని కొన్ని పదాలు తీవ్రంగా వాడినా చివరలో రాహుల్‌, సోనియా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వాలు వర్ధిల్లాలని నినాదాలు చేయడం అలవాటు లేని పనిగా కనిపించింది. దానికి తగినట్టే ఉత్తమ్‌ ప్రసంగంలో రేవంత్‌ను తమ్ముడు అని ఒకటికి రెండు సార్లు సంబోధించడం కాంగ్రెస్‌లో ఉండబోయే పరిస్థితికి అద్దం పట్టిందనొచ్చు. రాహుల్‌ గాంధీని కలుసుకోవడానికి వెళ్ళినా కేవలం పదిమందికే అవకాశం ఉండటం కూడా అక్కడ పద్ధతులకు తొలి సంకేతం అవుతోంది. రేవంత్‌కు టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇవ్వాలని అంగీకారం కుదిరిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్‌ పట్టాభిషేకం తర్వాత ఏర్పడే కొత్త నాయకత్వాల ఎంపికలో భాగంగా రేవంత్ ఎంపిక ఉంటుందని అంటున్నారు. అందుకే ఆయన కొంత హడావుడిగానే చేరుతున్నారట. రాహుల్‌ తో పాటు రావడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌ వ్యవస్థలో ప్రాధాన్యత పెరుగుతుందని రేవంత్‌ అనుకుంటున్నారు. ఇక తెలుగుదేశం రాష్ట్ర అద్యక్షుడు ఎల్‌.రమణ చేస్తున్న వ్యాఖ్యలు అంతబాగా లేవని ఆ పార్టీ వారే అంటున్నారు. పెద్దిరెడ్డి కూడా విమర్శనాత్మకంగానే మాట్టాడారు. మొత్తంపైన రేవంత్‌ సంయమనం పాటిస్తున్నా తెదేపా నేతలే తొందరపడుతున్నారనిపిస్తోంది.