తెలుగోళ్ళంటే భాజపాకి భయం పట్టుకుందా.!

106
భాజ‌పా ప‌ట్ల‌ తెలుగువారి వ్య‌తిరేక‌ సెగ నెమ్మ‌దిగా ఆ పార్టీ అధినాయ‌క‌త్వానికి త‌గులుతోంది. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు, హామీల అమ‌లు విష‌యంలో టీడీపీ చేస్తున్న పోరాటాన్ని తేలిగ్గా తీసుకున్న‌ట్టు పైపైకి న‌టిస్తున్నా లోలోప‌ల భాజ‌పాకి ఎక్క‌డో భ‌యం మొద‌లైంద‌నే చెప్పొచ్చు. ఫలితంగా ఇప్పుడు క‌ర్ణాట‌క విష‌యంలో భాజ‌పా అంత‌ర్మ‌థ‌నం ప‌డుతోంది.
త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అక్క‌డ కూడా భాజ‌పా అధికారంలోకి రావాల‌ని ర‌క‌ర‌కాల వ్యూహాలకు మోడీ, అమిత్ షా ద్వ‌యం ప‌దును పెడుతోంది. అయితే, క‌ర్ణాట‌క‌లో స్థిర‌ప‌డ్డ తెలుగువారి నుంచి త‌మ‌కు వ్య‌తిరేక‌త త‌ప్ప‌దేమో అనే చ‌ర్చ భాజ‌పాలో మొద‌లైంద‌ని స‌మాచారం. భాజ‌పా అన్యాయం చేసింద‌న్న వ్య‌తిరేక‌త ఆంధ్రాలో చాలా తీవ్రంగా ఉంది. ఇలానే, ఉద్యోగ వ్యాపార రీత్యా క‌ర్ణాట‌కలో స్థిర‌ప‌డిన తెలుగువారిలో కూడా వ్య‌తిరేక‌త ఉంటుందేమో అనే టెన్ష‌న్ చర్చనీయం అవుతోందట.
బీద‌ర్‌, క‌ల‌బుర్గి, బ‌ళ్ళారి, కోలార్ ఈ ప్రాంతాల్లో దాదాపు 30 శాతం ప్ర‌జ‌లు తెలుగు మూలాలు ఉన్న‌వారే. ఇక‌, రాయ‌ల‌సీమ ప్రాంతం నుంచి బెంగ‌ళూరు వెళ్లి స్థిర‌ప‌డ్డ‌వారు చాలామంది ఉన్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంతోపాటు, ఇత‌ర తెలుగు మాట్లాడే క‌మ్యూనిటీల‌ను క‌లిపి ఇక్క‌డ వ‌క్క‌లింగ‌లుగా వ‌ర్గీక‌రిస్తారు. ఈ వ‌క్క‌లింగ‌లు రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద క‌మ్యూనిటీగా చెప్తారు. సొంత రాష్ట్రానికి భాజ‌పా అన్యాయం చేసింద‌నే భావన కేవ‌లం ఆంధ్రాకు మాత్ర‌మే ప‌రిమితం కాదు క‌దా. కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి అన్యాయం జ‌రిగిందనీ, ప్యాకేజీ ఇస్తామ‌ని ఇవ్వ‌కా, ప్ర‌త్యేక హోదా కూడా ప్ర‌క‌టించ‌క ఆంధ్రా ప్ర‌యోజ‌నాల‌ను కాల‌రాస్తోంద‌నే ఆగ్ర‌హం క‌ర్ణాట‌కలో కూడా వ్య‌క్త‌మౌతుందా అనే త‌ర్జ‌న‌భ‌ర్జ‌నలో భాజపా ఉంది.
భాజపాతో పొత్తు తెంచుకునే దిశగా తెదేపా అడుగులేస్తుండటం కూడా అక్కడి తెలుగువారిని ప్రభావితం చేసే అవకాశమే అవుతుంది. అందుకే, భాజ‌పా శ్రేణుల్లో కొంత ఆందోళ‌న వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క‌లోకి తెలుగు సంఘాల‌తో త్వ‌ర‌లోనే భాజ‌పా నేత‌లు వరుసగా కొన్ని సమావేశాలు నిర్వ‌హించ‌బోతున్నారు. వీటిలో వ్య‌క్త‌మ‌య్యే అభిప్రాయానికి అనుగుణంగా త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. సొంత రాష్ట్రం వెన‌క‌బాటుకు భాజపా కార‌ణం అనే భావన అక్క‌డి తెలుగువారిలో ఏర్పడితే ఎన్నిక‌ల్లో వారంతా వ్య‌తిరేకంగానే ఓటు వేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయి.