‘ఫస్ట్ లుక్’తో చూపు తిప్పుకున్నారు

148

దివంగత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ దర్శకుడు క్రిష్ చేతికి వెళ్ళాక అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది. ఈ సినిమాని చేతుల్లోకి తీసుకున్న త‌ర‌వాత‌ రూపు రేఖ‌లు, ప్ర‌మాణాలు మార్చ‌డంలో పూర్తిగా నిమ‌గ్న‌మ‌య్యాడు క్రిష్‌. తాజాగా గురువారం సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో బ‌యోపిక్‌ ఫ‌స్ట్ లుక్ విడుదల చేసారు.

ఫ‌స్ట్ లుక్‌లో ఎన్టీఆర్ సినీప్రయాణం ప్రారంభించిన ‘మ‌న‌దేశం’ చిత్రంలోని గుర్తు చేస్తూ అదే వేష‌ధార‌ణ‌లో ఉన్న బాల‌య్య‌ని చూపించాడు. ఎన్టీఆర్ చ‌రిత్ర రాయాల్సి వస్తే ఆ సంఘ‌ట‌న మొత్తం ఓ అధ్యాయంగా నిలుస్తుంది. దాన్ని ఫ‌స్ట్ లుక్ పేరుతో గుర్తు చేస్తూ నంద‌మూరి అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాడు. బాల‌య్య రూపం పూర్తిగా చూపించ‌కుండా సైడ్ లుక్‌తో స‌రిపెట్ట‌డం కూడా తెలివైన నిర్ణ‌య‌మే.

ఎన్టీఆర్ త‌న డైరీలో అభిమానుల‌ను ఉద్దేశించి రాసుకున్న మాట‌ల్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేసారు. ‘అభిమానమును మించిన ధనము లేదు. ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. సదా మీకు రుణపడినట్టే’ అంటూ ఎన్టీఆర్‌ తన డైరీలో రాసుకున్న మాటల్ని ఫస్ట్‌లుక్‌లో పొందుపరిచారు. అది కూడా అభిమానుల మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్న‌మే.

మొత్తానికి ఫ‌స్ట్ లుక్‌తో క్రిష్ మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటిస్తుందని చెప్పుకుంటున్నారు. మహేష్, సుమంత్, కీర్తి సురేష్ ఇలా పలువురు సినిమాలో పాలు పంచుకుంటారని వార్తలను చిత్రబృందం ఎపుడు అధికారికంగా ఆమోదిస్తుందో చూడాలి.