మరోసారి నెరవేరని ‘ఛాలెంజ్’లు చేసుకున్నారు

404

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీని అధికార పార్టీ తెలుగుదేశం ద‌క్కించుకుంది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వైకాపాకు ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే, రాబోయే కురుక్షేత్రానికి నంద్యాల నాంది అంటూ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. కానీ, ఫ‌లితం తారుమారు అయ్యేస‌రికి ఆ మాట‌పై వైకాపా స్పంద‌న మారిపోయింది. ఇది కేవ‌లం ఒక నియోజ‌క వ‌ర్గంలో జ‌రిగిన ఉప ఎన్నిక మాత్ర‌మే అని జ‌గ‌న్ చెప్పారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాల‌ని స‌వాలు విసిరారు. వైకాపా టిక్కెట్ పై గెలిచిన‌వారంద‌రూ ఎన్నిక‌ల బ‌రిలోకి రావాల‌నీ, అప్పుడు వైకాపా స‌త్తా ఏంటో తెలుస్తుంద‌ని జ‌గ‌న్ ఛాలెంజ్ చేసారు.

మరో వైపు నంద్యాల ఫ‌లితాల‌పై ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ఇలాంటి ప్ర‌తిప‌క్ష నేత‌ను తాను ఎప్పుడూ చూడ‌లేద‌నీ, ఆయ‌న మాట్లాడే భాష ఎంత దారుణంగా ఉన్నా ప్ర‌జ‌ల కోసం స‌హిస్తూ వ‌చ్చామ‌న్నారు. అభివృద్ధి చేసిన‌వారిని ప్ర‌జ‌లు గుర్తిస్తార‌నీ, నంద్యాల‌లో అదే జ‌రిగిందంటూ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలుగుదేశం పాల‌న‌పై ప్ర‌జ‌లు చాలా సంతృప్తిగా ఉన్నార‌ని నంద్యాల ఉప ఎన్నిక రుజువు చేసింద‌న్నారు. జ‌గ‌న్ కు ఎన్నిక‌లంటే స‌ర‌దాగా ఉంద‌నీ, కావాల‌నుకుంటే వైకాపా ఎంపీల‌తో రాజీనామాలు చేయించాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌త్యేక హోదా రాక‌పోతే జూన్ లో వైకాపా పార్ల‌మెంటు స‌భ్యుల‌తో రాజీనామాలు చేయిస్తా అన్నార‌నీ, ముందుగా ఆ ప‌ని చేయాలంటూ ఛాలెంజ్ విసిరారు.

మొత్తానికి, అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మ‌రోసారి ఈ రాజీనామాల అంశం తెర‌మీదికి వ‌చ్చింది. ఫిరాయింపుదారుల‌తో రాజీనామా చేయించాల‌నే డిమాండ్ కు తెదేపా ద‌గ్గ‌ర స‌రైన స‌మాధానం లేదు కాబ‌ట్టి… చ‌ర్చ‌ను అటువైపు వెళ్ళనీయ‌కుండా, వైకాపా ఎంపీల రాజీనామా విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ విష‌యంపై వైకాపా కూడా నేరుగా స్పందించే అవ‌కాశం లేదు. ఎందుకంటే, ప్ర‌త్యేక హోదా పోరాటాన్ని వైకాపా మ‌ధ్య‌లోనే వ‌దిలేసింది. ఉద్య‌మిస్తాం, సాధిస్తాం, రాజీనామాలు చేస్తాం, ఒత్తిడి తెస్తాం, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెడ‌తాం అంటూ జ‌గ‌న్ మాట్లాడారే త‌ప్ప‌, కార్య‌రూపంలో క‌నిపించింది పెద్ద‌గా లేదు.