మరోసారి సామాజిక వర్గ రాజకీయాలనే నమ్ముకున్నారు

122
తెదేపా తరపున సీఎం ర‌మేష్ రెండోసారి రాజ్య‌స‌భ సీటు ద‌క్కించుకున్నారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై కృత‌జ్ఞ‌త‌ను చాటుకునేందుకు ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకున్నారు. ‘ప్ర‌జాసేవ చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన నా రాజ‌కీయ గురువు’ అంటూ పాదాభివంద‌నాలు చేస్తున్న‌ట్టు ఆ ప్ర‌కట‌న‌లో పేర్కొన్నారు. సీఎం ర‌మేష్ ను రెండోసారి ఎంపిక చేయ‌డం వెన‌క ప‌నిచేసిన స‌మీక‌ర‌ణం ఏంటీ అనేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు.
ఇలాంటి వ్యాపార‌వేత్త‌ల్ని ఒక‌టికి రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు పంపడం ద్వారా ప‌ద‌వుల‌కు వ‌చ్చేస‌రికి అధికార పార్టీ ప్రాధ‌మ్యాలు మారిపోతాయ‌నే చ‌ర్చ మ‌రోసారి జ‌రిగేలా చేసుకుంటున్నారు. అది చాల‌దన్న‌ట్టుగా, ప‌త్రిక‌ల్లో ఇలా భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డమూ స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించుకోవ‌డం కూడా కాస్త అతిగా అనిపిస్తోంది. అంతేకాదు, ఎంత వ‌ద్ద‌నుకున్నా త‌మపై ఉన్న ఒక‌ సామాజిక వ‌ర్గ అనుకూల ముద్ర నుంచి తెదేపా బయటకి రాలేకపోతుందన్న అంశాన్ని మరోసారి గుర్తుచేసినట్టే అవుతుంది.
రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా కూడా తాము రెడ్డిల పార్టీ అనే ముద్ర‌ను మ‌రింత బ‌లంగా చాటిచెప్పిన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించింది. అంతేకాదు, ఆ పార్టీలో గౌర‌వ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచీ ఎంపీలు, రాజ్య‌స‌భకు నామినేట్ అయిన ఎంపీలూ అంద‌రూ ఆ సామాజిక వ‌ర్గం వారే క‌నిపిస్తారు. పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ‌, అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, అసెంబ్లీ పీయేసీ ఛైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర రెడ్డి. ఐదుగురు లోక్ స‌భ స‌భ్యుల్లో అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఆ సామాజిక వ‌ర్గ‌మే. రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన విజ‌య‌సాయి రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా .. ఇదీ ఆ పార్టీ పాటిస్తున్న ‘సామాజిక వ‌ర్గ’ న్యాయం.
రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కూడా త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌కే మ‌రోసారి ఈ రెండు పార్టీలూ ప్రాధాన్య‌త ఇచ్చుకున్నాయి. ఢిల్లీలో బ‌ల‌మైన లాబీయింగ్ చేస్తార‌నో, పార్టీల‌కు ఆర్థికంగా అక్క‌ర‌కు వ‌స్తార‌నో లాంటి అర్హ‌త‌లే రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌కు ప్రాతిప‌దిక‌లు అయిపోయాయి. అభ్య‌ర్థుల ఎంపిక అంటే ఇంతే అనే ఒక స్థిర‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో మ‌రింత‌గా ముద్ర‌ప‌డేట్టుగానే పార్టీల వ్య‌వ‌హ‌ర స‌ర‌ళి ఉంటోంది. ఈ క్ర‌మంలో ప‌క్క రాష్ట్రంలోని తెరాస కూడా ఏమీ తీసిపోలేదు. రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో వారు పాటించిందీ వెలమల సామాజిక వ‌ర్గ న్యాయ‌మే.