రివ్యూ : శంభో శంకరా.! ..కామెడీ ఎక్కడ.?

300

కమెడియన్స్‌ హీరోలుగా మారి సినిమాలు చేయటం తెలిసిందే. అయితే వీరిలో సక్సెస్‌ సాధించిన వారు మాత్రం చాలా అరుదు. గతంలో హీరోలుగా మారిన చాలా మంది కమెడియన్స్ తరువాత తిరిగి కామెడీ రోల్స్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం షకలక శంకర్‌ హీరోగా మారి శంభో శంకర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కథేమంటే..

కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో రాబందు లాంటి ప్రెసిడెంట్‌ అజయ్‌ ఘోష్‌. ఆ ప్రెసిడెంట్‌కు తోడు గా ఓ అవినీతి పోలీసాఫీసర్‌. ఆ ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). ప్రెసిడెంట్‌ కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్‌ ఆ ప్రెసిడెంట్‌ కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది. ప్రెసిడెంట్ పెత్తనాన్ని ప‍్రశ్నిస్తూ శంకర్‌ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే కథలో ప్రెసిడెంట్‌ కంటే పెద్దదొంగ ఒకడు ఉంటాడు. అతడికి మన హీరో శంకర్‌కి మధ్య సంబంధం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్ళాల్సిందే.

ఎలా ఉందంటే..

కమెడీయన్‌ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకులు కామెడీ ఎంటర్‌టైనర్‌నో, కథా బలం ఉండి ఆకట్టుకునే కథనంతో ఉన్న చిత్రాలను ఎంచుకుంటారు. సినిమా ప్రమోషన్స్‌లో వీరావేశంగా కథపై ఉన్న నమ్మకంతో త్రివిక్రమ్‌, దిల్‌రాజు, రవితేజ, అల్లు శిరీష్‌ను కలిసాను. కొందరు తీయడానికి రెడీగా ఉన్నా టైమ్‌ పడుతుందని అన్నారంటూ శంకర్‌ చెప్పారు. కానీ సినిమా చూస్తే అంత బలమైన కథగా కనిపించదు. చాలా సన్నివేశాల్లో గతంలో వచ్చిన సినిమాల్లోని ఛాయలు కనిపిస్తాయి.  పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌  సీన్స్‌ మరీ సిల్లీగా అనిపిస్తాయి. ప్రెసిడెంటుపై స‌వాల్ చేయ‌డం, ఊరిని బాగు చేయ‌డం, స్కూళ్ళు క‌ట్టించ‌డం, జెండా ఎగ‌రేయ‌డం, రైతుల గురించి స్పీచులు ఇవ్వ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే ష‌క‌ల‌క శంక‌ర్‌కి మాస్ హీరోగా ఎదిగిపోవాలన్న త‌ప‌న ఎక్కువై సినిమా చేసాడేమో అనిపిస్తుంది. ఎవ‌రి బలాలు, బ‌ల‌హీన‌తలు వాళ్ళు తెలుసుకోవాలి. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా డైలాగులు చెబుదాం, బ‌న్నీలా డాన్సులు చేద్దాం, ఎన్టీఆర్‌లా ఫైట్లు చేద్దాం అనుకున్నాడు. అవ‌న్నీ చేస్తూ పాటు ష‌క‌ల‌క శంక‌ర్‌లా న‌వ్వించటం మరిచిపోయాడు. పవన్‌ ఇమేజ్‌ను వాడుకొని జబర్థస్త్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న శంకర్‌ వెండితెర మీద కూడా అదే ప్రయత్నం చేసాడు. అయితే ఈ సారి ఆ ప్రయత్నం పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు.

ఎవరెలా..

షకలక శంకర్‌కు హీరోగా మారడం కోసం పడ్డకష్టం తెరపై కనిపిస్తుంది. హీరో స్థాయిలో కాకపోయినా మంచి లుక్‌లో కనిపించాడు. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్స్‌ విషయంలో బాగానే కష్టపడ్డాడు. డైలాగ్‌ డెలివరీ విషయంలో కూడా ఓకే అనిపించాడు. ఇక హీరోయిన్‌గా పార్వతి పాత్రలో కారుణ్య చౌదరిది చిన్న పాత్రే. ప్రెసిడెంట్‌గా అజయ్‌ఘోష్‌ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో రవి, నాగినీడు, హీరో స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఫైనల్ గా..

క‌మిడియ‌న్లు హీరోలయితే కామెడీ చేయకూడదా.?