రివ్యూ : ‘మెహబూబా’ బోర్డర్ దాటలేదు

199

పూరీ జగన్నాధ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ-లాంచ్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘మెహ‌బాబూ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే ..

చిన్నతనం నుంచి రోషన్‌ (ఆకాష్ పూరీ)ను సైనికుడైన తనను ఎవరో చంపేసినట్లుగా, హిమాలయాల్లో తాను ఎవరికో మళ్ళీ వస్తానని మాట ఇచ్చినట్లుగా ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్‌ లో ఉన్న అఫ్రీన్‌కు అలాంటి కలే వస్తుంది. ఇంట్లో వాళ్ళు చేసే పెళ్ళి ఇష్టం లేని అఫ్రీన్‌, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది. అలా హైదరాబాద్‌ చేరిన అఫ్రీన్‌ను రోషన్‌ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. అఫ్రీన్‌ ఇండియాకు రావటం, ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్న నాదిర్‌ (విషు రెడ్డి)కు నచ్చదు. తిరిగి పాకిస్థాన్‌ వెళుతున్న అఫ్రీన్‌కు అదే ట్రైన్‌లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. ట్రెక్కింగ్‌కు వెళ్ళిన రోషన్‌కు గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా పుట్టుందని తెలుసుకుంటాడు. చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

కథ విష‌యంలో పూరి కొంచెం మారాడు. కొత్త క‌థ కాక‌పోయినా, పాత క‌థే తిర‌గ‌రాసే ప్ర‌య‌త్నం చేసాడు. గ‌త జ‌న్మ‌లో ప్రేమికులు ఇద్ద‌రు విడిపోతారు. ప్రేమ పొంద‌డానికి మ‌రోసారి జ‌న్మెత్తుతారు. మూగ‌మ‌న‌సులు, జాన‌కీ రాముడు, మ‌గ‌ధీర‌ లాంటి కథే అయినా పూరి త‌న‌దైన మార్పులు చేర్పులూ చేసాడు. హీరో హీరోయిన్ల‌ని దేశాలు మార్చేసి క‌థ‌లో మార్పు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేసాడు. స‌రిహ‌ద్దులు దాటిన ప్రేమ క‌థ ఇది. హీరోయిన్‌ది పాకిస్థాన్‌, హీరోది ఇండియా. పూరి క‌మర్షియ‌ల్ క‌థ‌ని ప్ర‌జెంట్ చేసే ప‌ద్ధ‌తిలో మారే ప్ర‌య‌త్నం చేశాడు. పూరి సినిమాల్లో, క‌థ‌ల్లో క‌నిపించే రెగ్యుల‌ర్ హీరో మెహ‌బూబాలో లేడు. ఆకాష్ ఫైటింగ్ చేస్తున్నా, ఎమోష‌న్ సీన్లు చేస్తున్నా ఇంకా ‘బాల న‌టుడి’గానే క‌నిపిస్తుంటాడు. ఈ సినిమాకి అదో పెద్ద‌మైన‌స్‌.

ఓ జ‌న్మ‌లో ప్రేమికులు విడిపోయి.. చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతుంటే ఉండాల్సిన ఎమోష‌న్ మెహ‌బాబూలో క‌నిపించ‌దు. విశ్రాంతి వ‌ర‌కూ పూరి కాల‌క్షేపం చేసాడు. దేశ‌భ‌క్తిని చాటి చెప్పే స‌న్నివేశాలు రాసుకొనే అవ‌కాశం పూరికి అక్క‌డ‌క్క‌డ వ‌చ్చింది. దాన్ని స‌ద్వినియోగ ప‌ర‌చుకున్నాడు. ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ నేప‌థ్యంలో తీసిన సీన్ కూడా బాగానే ఉంది. పాకిస్థాన్ నుంచి వ‌చ్చిన హీరోయిన్‌ హైద‌రాబాద్ లో వ‌చ్చీ రానీ తెలుగులో మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటే, పాకిస్థాన్‌లో ఉన్న విల‌న్‌, హీరోయిన్ ఇంటి స‌భ్యులు మాత్రం తెలుగులో మాట్లాడేస్తుంటారు.

ఎవరెలా..

ఆకాష్ పూరి మ‌రో రెండేళ్ళు ఆగి ఈ క‌థ తీసుంటే క‌నీసం త‌న పాత్ర‌కైనా తాను న్యాయం చేసేవాడు. నేహా శెట్టి అందంగా ఉంది. అయితే ఆకాష్ పక్క‌న అక్క‌లా క‌నిపిస్తుంది. ముర‌ళీ శ‌ర్మ‌, షాయాజీ షిండే త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేసారు. ఇంకెవరూ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేదు. సందీప్ చౌతా అందించిన పాట‌ల్లో మెహ‌బూబా బాగుంది. నేప‌థ్య సంగీతంలోనూ ఆక‌ట్టుకున్నాడు. సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు ప‌డ‌తాయి. ద‌ర్శ‌కుడి కంటే మాట‌ల ర‌చ‌యిత‌గా పూరి అక్క‌డ‌క్క‌డ మెప్పిస్తాడు.

ఫైనల్ గా..

ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవ‌డం, కొడుకును హీరోగా చూసుకోవ‌డం కోసం పూరి చేసిన ప్ర‌య‌త్నంలో బోర్డ‌ర్‌కి ఇవ‌త‌లే చ‌తికిల ప‌డ్డాడు.