నంద్యాల ఓటమికి కుంగిపోకుండా భవిష్యత్తు వ్యూహాలకు పదును పెట్టాలి…

495

పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సమానస్థాయిలో స్వీకరిస్తారు. విజేతలు, పరాజితులు ఒకరినొకరు కౌగలించుకుని అభినందించుకుంటారు. దురదృష్టవశాత్తూ మనదేశంలో ఇంకా ఆ స్ఫూర్తి రాలేదు. ఎన్నికల ప్రచారం మొదలు ఎన్నికలు ముగిసిన తరువాత కూడా పరస్పరారోపణలను గుప్పించుకుంటారు.

మనం అభిమానిస్తున్న అభ్యర్థి, మనకు ఇష్టమైన పార్టీ ఎన్నికలలో ఓడిపోతే ఆ సత్యం మనకు జీర్ణం కావడం కష్టం. మనకే ఏదో భారీ నష్టం కలిగినంతగా విలవిలలాడిపోతాము. మనకు ఇష్టమైన అభ్యర్థి గెలిస్తే మనం ఏదో ఐఏఎస్ పాస్ అయినంత సంబరబడతాము. అవే భావాలు అవతలి పార్టీ అభిమానులకు కూడా ఉంటాయని గ్రహించము. ఇద్దరు అభ్యర్థులు పోటీ పడినపుడు ఎవరో ఒకరే గెలుస్తారు. గెలిపించినవారు ప్రజలే. ఓడించినవారు కూడా ప్రజలే. ఇవాళ ఓడించిన ప్రజలు రేపు గెలిపించరు అని, ఇవాళ గెలిపించినవారు రేపు ఓడించరు అని గ్యారంటీ ఏమిటి? గెలుపోటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. ఇపుడు గెలిచినవాడు ఎవరు? అతనేమీ విదేశీయుడు కాదుగా? మనవాడేగా? కాకపొతే అతను మరొక పార్టీ. ఒక కుర్రాడు గెలిచాడు. అతడిని ఆశీర్వదించండి. ఇదే శిల్పా నిన్నటివరకు తెలుగుదేశంలో ఉన్నవారే కదా? ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చినట్లయితే వైసిపి లోకి వచ్చేవారా?

కనుక ఇవాళ జరిగిన ఎన్నికల ఫలితాన్ని అందరూ సహృదయంతో స్వీకరించండి. రేపు ఎలా గెలవాలా అని ఆలోచించండి. మనకో సామెత ఉన్నది. కోర్టులో కేసు ఓడిపోయినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు. ఇప్పటి రాజకీయాలకు కూడా ఆ సూత్రం వర్తిస్తుంది.

నేను గతంలో చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నాను. వ్యూహకర్తల వలన ఏ పార్టీకి కూడా రవ్వంత ప్రయోజనం ఉండదు. గ్రామీణ వ్యవస్థ రూపురేఖలు, మనస్తత్వం తెలిసినవాడే సరైన వ్యూహాలు రచించగలరు. ఈ వ్యూహకర్తలు నిన్న మొన్న వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి లకు ఎవరు వ్యూహాలు రచించి ఇచ్చారు? పార్టీలో ఉన్న సీనియర్లు, పెద్దలు, తలపండిన అనుభవజ్ఞులు మాత్రమే సరైన పధకాలు పన్నగలరు.

గెలుపుకు పొంగిపోకూడదు. ఓటమికి కుంగిపోకూడదు. ఉపఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా తేడా ఉన్నది అని గ్రహిస్తే చాలు.

– ఇలపావులూరి మురళీ మోహన రావు