ఐదు రాష్ట్రాల్లోనూ ‘భాజపా’కే గుద్దుతారంట.!

274

నోట్ల రద్దు సంగతి ఎలా ఉన్నా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాపులారిటీ భాజపాకి క‌లసివచ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఒపీనియన్ పోల్స్ ఒకదాని తరువాత ఒకటి వెలువడ్డాయి.

ఇండియా టుడే సర్వే ప్రకారం ఉత్త‌రప్ర‌దేశ్ లో క‌మ‌లం విక‌సించే అవ‌కాశం ఉంద‌ని తేలింది. మొత్తం 403 సీట్లున్న యూపీలో భాజపా స్ప‌ష్ట‌మైన మెజారిటీతో 206 నుండి 216 సీట్ల‌ను గెల్చుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. దీనితో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్రజల స్పందన ఎలా ఉంటుందనే భయంలో ఉన్న భాజపా నేతలు ఈ సంకేతాలను నమ్మలేకపోతున్నారు. అధికార స‌మాజ్ వాదీ పార్టీ కుటుంబ రాజకీయ రామాయణంతో మూల్యం చెల్లించ‌నుంది. స‌ర్వే అంచ‌నా ప్రకారం ఎస్పీ 92 నుంచి 97 సీట్లు గెలిచే అవ‌కాశం ఉంది. బీఎస్పీ 79 నుంచి 85 సీట్ల‌ను గెల‌వ‌వ‌చ్చు. కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్ల‌తో నాలుగో స్థానంలో ఉంటుందట.

ఏబీపీ న్యూస్ చాన‌ల్ స‌ర్వే ప్ర‌కారం ఎస్పీ, భాజపా పోటాపోటీ పడినా ప్రస్తుత సంక్షోభంతో ఎస్పీ చీలిపోతే భాజపాకే అధికారం దక్కనుంది. పంజాబ్, ఉత్త‌రాఖండ్ లో కూడా భాజపా, మిత్ర‌ప‌క్షాల‌తే విజ‌య‌మ‌ని ఏబీపీ అంచ‌నా వేసింది. అకాలీద‌ళ్, భాజపా సంకీర్ణ ప్ర‌భుత్వం మూడోసారి గెల‌వ‌డం క‌ష్ట‌మ‌ని కొంత కాలంగా ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నా స్వీయ త‌ప్పిదాల‌తో ఆప్ బ‌ల‌హీన ప‌డటంతో భాజపా కూట‌మికే  విజ‌యావ‌కాశాలు ఉన్నాయ‌ని తేల్చింది. 117 సీట్ల‌లో కాషాయ కూట‌మి 50 నుంచి 58 సీట్లు, కాంగ్రెస్ 41 నుంచి 49 సీట్లు, ఆప్ 12 నుంచి 18 సీట్లు గెల‌వ‌వ‌చ్చ‌ట‌.

అంటే భాజపా కూట‌మికి మెజారిటీ సీట్లు రాక‌పోయినా అతిపెద్ద రాజ‌కీయ శ‌క్తిగా నిలుస్తుంది. ఉత్త‌రాఖండ్ లోని 70 సీట్ల‌లో భాజపా 35 నుంచి 43 సీట్ల‌తో స్ప‌ష్ట‌మైన విజేత‌గా నిలుస్తుంద‌ట‌. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో కూడా అస్సాంలోని ఫలితమే వస్తుందని జోస్యం చెప్పింది.