ప్రతిపక్షనేత మకాం ఆంధ్రాకి మారుతోంది.!

372

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే ఆంధ్రాకి మ‌కాం మార్చ‌నున్నారు. మ‌రో రెండేళ్ళలో ఎన్నిక‌లు రాబోతున్నా ఇంకా హైద‌రాబాద్ లోనే పార్టీ కేంద్ర కార్యాల‌యం ఉంది. సార్వ‌త్రిక‌ ఎన్నికలు  సాధార‌ణం క‌న్నా క‌నీసం ఓ ఆర్నెల్లు ముందు ఎన్నిక‌లో జ‌రిగే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పై పార్టీ నేత‌ల ఒత్తిడి పెరిగింది. దీంతో త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ నుంచి మ‌కాం మార్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందుకు ద‌స‌రా పండుగ రోజున ముహూర్తం పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.

ఆంధ్రాలో వైకాపా కార్యాల‌యం నిర్మించే ప‌నులు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. తాడేప‌ల్లిలో ఓ రెండు ఎక‌రాల్లో పార్టీ ఆఫీస్ నిర్మిస్తున్నారు. జ‌గ‌న్ ఆంధ్రాకి నివాసం మార్చ‌క‌పోవ‌డంపై తెలుగుదేశం నేత‌లు కూడా గతంలో తీవ్రంగా విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే అంశ‌మై కొద్దిరోజులు కింద‌ట జ‌గ‌న్ స్పందిస్తూ ఆంధ్రాలో సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాక‌నే వ‌స్తాన‌ని ఓ బ‌హిరంగ స‌భ‌లో చెప్పారు. శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే వ‌ర‌కూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే విష‌య‌మై ప్ర‌భుత్వానికి ఒక లేఖ రాసారు. అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో త‌న‌కు రెగ్యుల‌ర్ గా కేటాయిస్తున్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను తాత్కాలిక నివాసంగా కేటాయించాల‌ని జ‌గ‌న్ కోరారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం క్యాబినెట్ హోదా ఉన్న ప్ర‌తిప‌క్ష నాయకుడికి ప్ర‌భుత్వం నివాసం కేటాయించే అవ‌కాశం ఉంటుంది. కానీ, జ‌గ‌న్ లేఖ‌పై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. జ‌గ‌న్ లేఖ‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేద‌ని వైకాపా వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రికొద్ది రోజులుపాటు ప్ర‌భుత్వం స్పంద‌న కోసం ఎదురుచూసి ఆ త‌రువాత‌, ఇదే అంశ‌మై విమ‌ర్శ‌ల‌కు దిగేందుకు వైకాపా సిద్ధంగా ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంకా హైద‌రాబాద్ లో కూర్చుంటూ ఏపీలో రాజ‌కీయాలు చేయ‌డం కుద‌ర‌ద‌ని తెలుసుకున్న‌ట్టున్నారు.