రాజ్యసభ ఉప చైర్మన్ ఎన్నికకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు

229

రాజ్య‌స‌భ ఉప ఛైర్మ‌న్ ఎన్నిక‌ను భాజ‌పా, కాంగ్రెస్ లు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చూస్తున్నాయి. కొద్దిరోజుల కింద‌ట తెరాస నుంచి కేశ‌వ‌రావు అభ్య‌ర్థిగా ఉంటార‌ని వార్తలు వినిపించినప్పటికీ అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని తేలిపోయింది. అయితే, ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫు అభ్య‌ర్థిగా తృణ‌మూల్ కాంగ్రెస్ నేత తెర మీదికి వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

టిఎమ్‌సి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామంటూ కాంగ్రెస్ కూడా మ‌మ‌తా బెన‌ర్జీకి భ‌రోసా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి, రాజ్య‌స‌భ ఉప ఛైర్మ‌న్ ఎన్నిక అనేది అంత‌గా ప్రాధాన్య‌త లేని అంశంగా ఉండేది. కానీ, రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ కు కొంత అవ‌కాశం ఉంది కాబ‌ట్టి, ఇక్క‌డ భాజ‌పాకి ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ ఉంది. ఈ క్ర‌మంలో విప‌క్షాల ఐక్య‌త‌కు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తూ ఉండ‌టం, తాను వెన‌క ఉండి ఇత‌ర పార్టీలకు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది.

భాజ‌పా మ‌ద్ద‌తుతో ఇత‌ర పార్టీల అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపే అవ‌కాశం త‌క్కువ‌. ఒక‌వేళ ముందుగా ఊహాగానాలు వ‌చ్చిన‌ట్టు తెరాస లాంటి తటస్థ పార్టీ నుంచి అభ్య‌ర్థిని ఎంపిక చేస్తే సొంత ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త త‌ప్ప‌దు. కాబ‌ట్టి, భాజ‌పా సొంత అభ్య‌ర్థిని పెట్టాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే భాజ‌పాకి సొంతంగా అంటూ రాజ్య‌స‌భ‌లో పెద్ద‌గా బ‌లమేమీ లేదు.  ఏదేమైనా, రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్ష ఎన్నిక‌ ర‌స‌వ‌త్తరంగా మారిపోయింది.

వాస్తవానికి ఇది భాజ‌పాయేత‌ర కూటమిలోని ప‌క్షాల మధ్య ఐక‌త్య‌ను పెంచే మ‌రో వేదిక‌గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి రాయ్ అనే వ్య‌క్తి పోటీకి దిగుతున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ అభ్యర్థి అన‌గానే ఏపీ సీఎం మ‌ద్ద‌తు, కర్ణాట‌క ముఖ్య‌మంత్రి మ‌ద్ద‌తు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఇత‌ర భాజ‌పాయేతర పార్టీలు టిఎమ్‌సికి అండ‌గా నిల‌వ‌డం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎటువైపు ఉంటార‌నేది కూడా తేలిపోతుంది.

తెరాస లాంటి పార్టీలు త‌ట‌స్థంగా ఉండిపోయే ప‌రిస్థితి వ‌స్తే, భాజ‌పా అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశాలు రాజ్య‌స‌భ‌లో చాలా త‌క్కువ‌. విప‌క్షాల మ‌ధ్య క‌నిపిస్తున్న ఐక‌త్య‌ను గ‌మ‌నిస్తే రాజ్య‌స‌భ‌లో త‌మ ప‌ట్టు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశమే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే, ఈ క్ర‌మంలో భాజ‌పా వ్యూహం ఏంట‌నేదే చూడాలి.